ప్రజా పోరాట యాత్ర పేరుతో జనసేన పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళుతూనే.. ఎన్నికలకు ఎవరిని బరిలోకి దించాలనే అంశాలపైనా కసరత్తులు ప్రారంభించాడు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్! వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీచేస్తారని ప్రకటించినా.. ఇంకా దీనిపై కచ్చితమైన క్లారిటీ ఇవ్వలేదని అంతా భావిస్తున్నారు. తన సామాజికవర్గంతో పాటు యువత ఎక్కువగా ఉన్న గోదావరి జిల్లాలపై పవన్ ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ ఎంపీ సీటుకు ఎవరిని బరిలోకి దింపాలనే అంశంపై క్లారిటీతో ఉన్నారని చెబుతున్నారు. ఇక్కడి నుంచి పవన్ సోదరుడు నాగబాబు పోటీచేస్తారని సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు. త్వరలోనే ఆయన జనసేన ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రజారాజ్యం తరఫున సాధ్యం కానిది ఇప్పుడు జనసేనతోనైనా సాధించాలనే పట్టుదలతో నాగబాబు ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు సన్నిహితులు. అటు అన్న మెగాస్టార్ చిరంజీవికి, ఇటు పవన్‌కు అండగా ఉంటూ వస్తున్నారు నాగబాబు. ప్రజారాజ్యం తరఫున ఆయన గతంలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని మెగా అభిమానులతో పాటు అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఆయన కాకినాడలో పోటీచేస్తారనే ప్రచారం కూడా జోరుగా జరిగింది. అయితే అప్పటికే చిరంజీవి, అల్లు అరవింద్ పోటీచేయడంతో తాను విరమించుకున్నారు. అయితే ప్రస్తుతం మళ్లీ తమ్ముడు స్థాపించిన జనసేన నుంచి ఈసారి ఎలాగైనా ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారట.తాను ఎంపీగా పోటీ చేస్తానని, తనకు కాకినాడ సీటు ఇవ్వాలని నాగబాబు.. చాలాకాలం క్రితమే పవన్ ను కోరినట్టు సమాచారం. తాజాగా ఇందుకు పవన్ కూడా ఒప్పుకున్నాడని తెలుస్తోంది. కాపు ఓటర్లు అధికంగా ఉండే కాకినాడ నుంచి పోటీ చేస్తే తన గెలుపు సులువు అవుతుందని నాగబాబు భావిస్తున్నారట. త్వరలోనే కాకినాడ లోక్ సభ నియోజకవర్గానికి చెందిన కాపు సంఘాల నాయకులు, మెగా ఫ్యామిలీ అభిమానులతో నాగబాబు సమావేశం కాబోతున్నారనే వార్తలు కూడా ఈ వాదనకు బలాన్నిస్తున్నాయి. పవన్‌కు మెగా ఫ్యామిలీ అండ ఉంటుందని గతంలోనే మెగా హీరోలందరూ స్పష్టం చేశారు. పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతున్న నేపథ్యంలో మెగా అభిమానులు కూడా పవన్‌కు బాసటగా నిలుస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీ తరఫున పవన్ గోదావరి జిల్లాల్లో చేసిన ప్రచారం చాలా వరకూ ప్రజల్లోకి వెళ్లింది. ఫలితంగా టీడీపీకి కాపు ఓటర్లు పట్టం కట్టారు. అయితే ఈసారి మాత్రం రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన పోటీచేస్తే ఎక్కువ సీట్లు సాధించే జిల్లాల్లో తూర్పు, పశ్చిమగోదావరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక్కడ బలమైన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా మరిన్ని సీట్లు సాధించే అవకాశముందని పవన్ భావిస్తున్నాడు. అందులోనూ మెగా కుటుంబానికి చెందిన వారైతే.. గెలుపు మరింత సులువు అవుతుందనే ఆలోచనలో ఉన్నాడట.ఇక పవన్ ప్రభావం ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువుగా ఉండనుందని రాజకీయ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. ప్రజారాజ్యం కూడా ఇదే జిల్లాల్లో బలమైన ప్రభావం చూపింది. ఇక్కడ ప్రజారాజ్యం దెబ్బతో విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం ఎంపీ సీట్లలో టీడీపీ ఏకంగా మూడోప్లేస్‌కు పడిపోయింది. పశ్చిమలో ఒకటి, తూర్పులో 4, విశాఖలో 4 ఎమ్మెల్యే సీట్లను టీడీపీ గెలుచుకుంది. ఇక ఇప్పుడు జనసేన ఎఫెక్ట్ కూడా ఇక్కడే ఉంటుందన్న నేపథ్యంలో పవన్ ప్రధానంగా ఇక్కడే టార్గెట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన సోదరుడిని సైతం కాకినాడలో పోటీ చేయించే అంశంపై సీరియస్‌గానే ఆలోచన చేస్తున్నారు. మరి నాగబాబు ఎంట్రీ.. జనసేనకు ఎంత వరకూ లాభిస్తుందో వేచిచూడాలి.