కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మోస్తారు వర్షం కురిసింది. పగటి ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రైతులు మోస్తరుగా కురుస్తున్న వానలతో వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. బోర్లు, బావుల ఆధారంగా వ్యవసాయం చేసుకునే రైతులు ఇప్పటికే నారుమడులు పోసుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో నారుమడుల కోసం పొలం మడి సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 1,11,177 హెక్టార్లు కాగా, వానాకాలంలో 1,21,591 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటగా పత్తి సాగు చేస్తుండగా, తర్వాత వరి, మొక్కజొన్న సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. గత ఏడాది వానాకాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 68వేల హెక్టార్లలో పత్తి సాగు చేయగా, ఈసారి 72,560 హెక్టార్లలో పత్తి సాగువుతుందని అంచనా వేశారు. రైతుబంధు పెట్టుబడి సాయంతో ఖాళీగా ఉన్న భూములు ఈసారి సాగుకు సిద్ధం అవుతుండటంతో గతంలో కంటే ఈసారి 4,560వేల హెక్టార్లలో అదనపు సాగు కానుంది. ప్రధాన పంటగా పత్తితోపాటు వరి, మొక్కజొన్న, జొన్న, పెసర, కంది, జీలుగ పంటల సాగు కోసం 29,249 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు సిద్ధంగా ఉంచగా జూలై నెలలో కురిసే వర్షాలపై ఆధారపడి రైతులు విత్తనాలు వేసుకునేందుకు సిద్ధపడ్డారు. 74,514 టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచగా ఇందులో యూరియా 32,118 టన్నులు, డీఏపీ 8,993 టన్నులు, పొటాష్ 23,215 టన్నులు, 10, 278 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు సిద్ధంగా ఉన్నాయి.ఇప్పటికే వాణిజ్య పంటలు వేసుకున్న రైతులకు ఈ వర్షాలు ఊరటనివ్వగా, వర్షాధారంగా సాగుచేసే పత్తి, మొక్క జొన్న వంటి విత్తనాలు నాటే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. బావులు, బోర్ల కింద వరి నారుమళ్లు సిద్ధంగా ఉండటంతో కురుస్తున్న వర్షాలతో నాట్లు వేసుకునేందుకు అన్నదాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న వాతావరణశాఖ సూచనలతో జిల్లాలో వ్యవసాయ పను లు ఊపందుకోనున్నాయి. ఈనెలాఖరు వరకు అంచనా విస్తీర్ణానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. శనివారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా 20.5మి.మీ వర్షపాతం నమోదైంది. జఫర్‌గడ్ మండలంలో అత్యధికంగా 39.1మి.మీ, లింగాలఘనపురంలో 26.4, జనగామలో 25.8, బచ్చన్నపేటలో 13.8, నర్మెటలో 12.4, దేవరుప్పులలో 11, పాలకుర్తిలో 10.2, స్టేషన్‌ఘన్‌పూలో 5, కొడకండ్లలో 6, రఘునాథపల్లిలో 4.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇప్పటికే రైతుబంధు ద్వారా అందించిన పెట్టుబడి పంటసాయం డబ్బులతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచిన రైతులు తాజాగా కురుస్తున్న వర్షాలతో ముమ్మరంగా విత్తనాలు నాటుతున్నారు. ముందస్తు రుతు పవనాల ఆగమనంతో వాతావణంలో గణనీయమైన మార్పు లు చోటు చేసుకున్నాయి. జూన్ ఒకటిన కేరళలోకి ప్రవేశిస్తాయనుకున్న నైరుతి రుతుపవనాలు బంగాళా ఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో ముందుగానే మే 30న వచ్చాయి. దీంతో సంబురపడిన రైతులు కొన్నిచోట్ల విత్తనాలు నాటి మళ్లీ వానలు లేకపోవడంతో కొంత ఆందోళన చెందారు. ఇక ఈసారి వానలు ఆలస్యం అవుతాయనే ఆందోళనలో వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు వాతావరణం చల్లబడి మోస్తరు వానలు కురుస్తుంటంతో ఉపిరి పీల్చుకున్నారు. పునాస పంటలకు విత్తనాలు నాటేందుకు భూములు అనుకూలంగా మారడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.