- గ్రామీణ వ్యవసాయ మార్కెట్లు
- రైతుల ఆదాయం పెంచేలా అనేక చర్యలు
- ఆర్థిక వ్యవస్థగా భారత్..అరుణ్ జైట్లీ
నిర్మాణాత్మక సంస్కరణలతో దేశం ముందుకుపోతోందని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటోందని అన్నారు. వారి మెరుగైన జీవనం కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, కనీస మద్దతు ధరను పెంచిందని చెప్పారు. అల్పాదాయ సేద్యం చేసే వారికి కనీస మద్దతు ధరను పెంచుతున్నామని చెప్పారు. ఖరీఫ్ పంటలపై కనీస మద్దతు ధరను 1.5 రెట్లు పెంచామని గుర్తు చేశారు. సగానికిపైగా రైతులు సన్నకారు, మధ్యతరగతి రైతులేనన్నారు. రైతులు నేరుగా వినియోగదారులకే తమ పంటను అమ్ముకునేలా వ్యవస్థలను నిర్మిస్తున్నట్టు చెప్పారు. గ్రామీణ వ్యవసాయ మార్కెట్లను నిర్మిస్తున్నామన్నారు. మహాత్మ గాంధీ ఉపాధి హామీ పథకం కింద వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు వివరించారు. వ్యవసాయ, గ్రామీణ మార్కెట్లు, ఆస్పత్రులను సంధానించేలా ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్టు వివరించారు. రైతుల ఆదాయం పెంచేలా అనేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఆర్థిక దేశాల జాబితాలో ఐదో స్థానం..
‘‘మా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాక ప్రపంచ శక్తిమంతమైన ఆర్థిక దేశాల జాబితాలో ఐదో స్థానంలో భారత్ నిలిచింది. ఈ రోజు అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. జీఎస్టీని ప్రవేశపెట్టడం ద్వారా పరోక్ష పన్నుల వ్యవస్థ సరళతరమైంది. నోట్ల రద్దు ద్వారా ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. 2017-18లో ఎగుమతులు 17 శాతం పెరుగుతాయి. భారత్‌ది 2.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ. త్వరలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుంది. సులభతరమైన జీవనం కోసం కేంద్రం పనిచేస్తోంది’’ అని జైట్లీ వివరించారు.