వయోపరిమితి నిబంధనలు తీసుకొచ్చి తమను విధుల్లోంచి అకారణంగా తొలగించారంటూ కేంద్ర న్యాయశాఖకు తిరుమల శ్రీవారి ఆలయం మాజీ ప్రధాన అర్చకులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వారి విన్నపాన్ని పరిశీలించిన కేంద్ర న్యాయశాఖ దాన్ని తిరస్కరించింది. ఈ అంశం తమ పరిధిలోకి రావని, సమస్య ఏదైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలోనే పరిష్కరించుకోవాలని వారికి సూచించింది. దీంతో కేంద్రం జోక్యం వల్ల తమకు న్యాయం జరుగుతుందని ఆశించిన మాజీ ప్రధాన అర్చకుల భంగపాటు తప్పలేదు. శ్రీవారి ఆలయంలో కార్యక్రమాలు ఆగమశాస్త్రం ప్రకారం జరగడం లేదని, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా పాలక మండలి నిర్ణయాలు తీసుకుంటోందని అర్చకులు తమ ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాదు, తమను విధుల్లోంచి అకారణంగా తొలగించారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ మే 23న కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు మాజీ అర్చకులు ఫిర్యాదు చేశారు. వారి వినతిపత్రాన్ని పరిశీలించిన కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి డీసీ పాథక్ ఈ మేరకు లేఖ రాశారు. ఈ అంశం మా పరిధిలోది కాదు... ఏదైనా సమస్య ఉంటే రాష్ట్రస్థాయిలోనే పరిష్కరించుకోవాలని అందులో పేర్కొన్నారు. ప్రధాన అర్చక పదవి నుంచి టీటీడీ తొలగించడంతో రమణదీక్షితులు మీడియా ముందుకొచ్చి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. శ్రీవారి విలువైన నగలు, ఆభరణాలు విదేశాలకు తరలిపోయానని, గుప్త నిధుల కోసం ఆలయంలో తవ్వకాలు జరిపారాని పలు ఆరోపణలు చేశారు. స్వామివారికి కైంకర్యాలను కూడా సరిగ్గా నిర్వహించడంలేదంటూ ఆయన చేసిన విమర్శలపై జాతీయస్థాయిలో పెను దుమారమే రేపింది