బ్యాంకుల పనితీరు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల్లో బ్యాంకులు నమ్మకాన్ని నిలపాలని... వారిని మోసం చేసేందుకు ప్రయత్నించవద్దని చెప్పారు. బ్యాంకుల్లో చేసే డిపాజిట్లపై ప్రజల్లో తీవ్ర ఆందోళన ఉందని, పెద్ద ఎత్తున అపోహలు ప్రచారంలో ఉన్నాయని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇప్పటికీ నగదు కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని... ఉపాధి కూలీలకు డబ్బు చెల్లించడం కూడా కష్టమవుతోందని అన్నారు. బ్యాంకర్లు కొన్ని ప్రాంతాలను మాత్రమే పట్టించుకుంటున్నారని...అన్ని ప్రాంతాలనూ పట్టించుకోవాలని సూచించారు.ఏపీ వార్షిక రుణ ప్రణాళిక ఖరారయ్యింది. అమరావతి ప్రజా వేదిక హాల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం దీన్ని విడుదల చేశారు. మొత్తం వార్షిక ప్రణాళిక రూ.1,94,220కోట్లు కాగా.. ఇందులో ప్రాధాన్యేతర రంగానికి రూ.50వేలకోట్లు.. మైక్రో ఎంటర్ ప్రైజెస్‌కు రూ.14,028 కోట్లు.. స్మాల్ ఎంటర్ ఫ్రైజెస్‌కు రూ.11,500 కోట్లు.. భారీ పరిశ్రమలకు రూ.10,457 కోట్లు.. మీడియం ఎంటర్ ప్రైజెస్‌కు రూ.2,733కోట్లు కేటాయించారు. వ్యవసాయ రుణ ప్రణాళిక మొత్తం రూ.1,01,564 కోట్లుగా తేల్చారు.ఈ బ్యాంకర్ల సమావేశంలో బ్యాంకుల తీరు, కేంద్ర విధానాలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకర్లు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాలే కాని.. అపోహలు కలిగించకూడదన్నారు. నోట్ల రద్దు తర్వాత జనాలు కష్టాలు పడుతున్నారని.. బ్యాంకులు కొన్ని ప్రాంతాలను మాత్రమే పట్టించుకుంటున్నాయని అన్నారు. బ్యాంక్ డిపాజిట్లపై ఎన్నో అపోహలు ఉన్నాయని.. ఈ విషయంలో ప్రజలు కూడా ఆందోళనలో ఉన్నారని వ్యాఖ్యానించారు. వ్యవసాయంలో సుస్థిర వచ్చిందని.. హార్టికల్చర్‌కు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. 34% జీఎస్‌డీపీ వ్యవసాయం నుంచే వస్తోందని.. రియల్ టైమ్ గవర్నెన్స్‌తో పారదర్శకత తెచ్చామన్నారు. ప్రాధాన్యత అంశాలను పరిగణనలోకి తీసుకొని.. అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు సీఎం.