వచ్చే ఆగష్టు 15వతేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రాష్ట్ర స్థాయిలో శ్రీకాకుళం పట్టణంలో ఘణంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్ల విషయమై శుక్రవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో కూడిన సమన్వయ కమిటీ సమావేశంలో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ స్వాతంత్య దినోత్సవ వేడుకలను ఘణంగా నిర్వహించేందుకు వివిధ శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లను ఎటువంటి లోపాలకు ఆస్కారం లేకుండా పటిష్టవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలపై వేడుకలకు విచ్చేసిన ప్రజలందరినీ ఆకట్టుకునే విధంగాను వారిలో మరింత అవగాహన కలిగించే రీతిలో ఆయా శాఖల శకటాల ప్రదర్శన(టాబ్లూస్)ను ఏర్పాటు చేయాలని సిఎస్ ఆదేశించారు.స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నందున ఈవేడకలకు విచ్చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి,గవర్నర్,ఇతర మంత్రులు తదితర ప్రముఖలందరికీ తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను సిఎస్ ఆదేశించారు.ఈవేడుకలను ఘణంగా నిర్వహించి విజయవంతం చేసేందుకుగాను వివిధ శాఖల జిల్లా,రాష్ట్ర స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సిఎస్ ఆదేశించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 12 ప్రభుత్వ శాఖలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై శకటాలను ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులను సిఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు.ముఖ్యంగా వ్యవసాయ, ఉద్యానవన,మత్స్య,పశుసంవర్ధకశాఖలకు సంబంధించిన శకటం,సమాచార పౌరసంబంధాల శాఖ ద్వారా సంక్షేమ ఆంధ్రప్రదేశ్ పేరిట శకటం ఏర్పాటు చేయాలని చెప్పారు.అలాగే సిఆర్డిఏ,ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ప్రాస్ట్రక్చర్,ఎనర్జీ శాఖలు,విద్యా,అటవీ,వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమం,గృహ నిర్మాణం,గ్రామీణాభివృద్ధి-పంచాయితీరాజ్,సెర్ప్(సాధికారమిత్ర),సాంఘిక, గిరిజన,మహిళా శిశు సంక్షేమం,పర్యాటక,సాంస్కృతిక శాఖలతోపాటు నీటివనరుల శాఖలకు సంబంధించిన కార్యక్రమాలు,పధకాలపై ఈశకటాలను ఏర్పాటు చేయాలని సిఎస్ ఆదేశించారు.
ఈ సమావేశంలో రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరిగుప్త,సాధారణ పరిపాలనశాఖ(పొలిటికల్) కార్యదర్శి ఎన్.శ్రీకాంత్,ఎపిఎస్పి బెటాలియన్స్ ఐజి ఆర్.కె.మీనా,పాఠశాల విద్యాశాఖ కమీషనర్ సంధ్యా రాణి,ప్రొటోకాల్ విభాగపు అదనపు కార్యదర్శి కల్నల్ అశోక్ బాబు,సమాచారశాఖ కమీషనర్ ఎస్.వెంకటేశ్వర్,శ్రీకాకుళం జిల్లా కలక్టర్ కె.ధనంజయ రెడ్డి,ఎస్పి డా.సియం.త్రివిక్రమ్ వర్మ, శ్రీకాకుళం మున్సిపల్ కమీషనర్ ఆర్.శ్రీరాములు నాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు.