కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం విచ్చేసే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం జరుగనున్న నేపథ్యంలో, ఈ 6 రోజుల పాటు స్వామివారి దర్శనాలను పూర్తిగా నిలిపివేశామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. టిటిడి ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం శనివారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. అనంతరం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో ప్రతి 12 సంవత్సరాలకోసారి నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం ఆగస్టు 12 నుండి 16వ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నాట్లు తెలిపారు. ఆగస్టు 11న అంకురార్పణంతో ఈ వైదిక కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ జరిగే రోజుల్లో వైదిక కార్యక్రమాలు, శాంతిహోమాలకు ఎక్కువ ప్రధాన్యత వుంటుంది కావున భక్తులకు దర్శనం కల్పించేందుకు కొన్ని గంటలు మాత్రమే సమయం ఉండటంతో ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు 6 రోజుల పాటు శ్రీవారి దర్శనాలను టిటిడి ధర్మకర్తల మండలి నిలిపివేయాలని నిర్ణయించిందని ఆయన తెలిపారు.
ఇందులో భాగంగా ఆగస్టు 9వ తేదీ సాయంత్రం 6.00 గంటల నుండి భక్తులను క్యూలైన్లు మరియు వైకుంఠం కంపార్టుమెంట్లలోనికి అనుమతించరని తెలియచేశారు. ఆగస్టు 17వ తేదీ ఉదయం 6.00 గంటల నుండి భక్తులకు దర్శనం పున: ప్రారంభమవుతుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమలయాత్రను రూపొందించుకోవాలని ఛైర్మన్ మీడియా ద్వారా భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టిటిడి ఈవో అనిల్కుమార్ సింఘాల్, జెఈవోలు కె.ఎస్.శ్రీనివాసరాజు, పోల భాస్కర్, ధర్మకర్తల మండలి సభ్యులు చల్లా రామచంద్రారెడ్డి, రాయపాటి సాంబశివరావు, ఇ.పెద్దిరెడ్డి, పొట్లూరి రమేష్బాబు, సండ్ర వెంకటవీరయ్య, సుధా నారాయణమూర్తి, రుద్రరాజు పద్మరాజు, మేడా రామకృష్ణారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు అశోక్రెడ్డి పాల్గొన్నారు.