రాష్ట్రం ఆర్థిక లోటుతో సతమతమవుతున్నా నాలుగేళ్ళ పాలనలో సీఎం చంద్రబాబునాయుడు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల ముందుకు ధైర్యంగా వెళ్ళి మద్ధతు కోరాలని గుడా చైర్మన్ గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న అర్ధరహిత ఆరోపణలను, విమర్శలను తిప్పిగొట్టాలని అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో 16 వ తేదీ నుంచి జరగనున్న నగర దర్శిని కార్యక్రమంపై పార్టీ క్యాడర్కు దిశా నిర్ధేశం చేసేందుకు హోటల్ జగదీశ్వరిలో శనివారం నాడు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. నగర పార్టీ అధ్యక్షుడు వాసిరెడ్డి రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తొలుత ఎన్టిఆర్ విగ్రహానికి గన్ని, ఆదిరెడ్డిలతో పాటు శాప్ డైరక్టర్ యర్రా వేణుగోపాలరాయుడు, ఎస్సీ కార్పొరేషన్ డైరక్టర్ కాశి నవీన్కుమార్, ఫ్లోర్ లీడర్ వర్రే శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ 1993లో రాజమహేంద్రవరంలో ఎన్టిఆర్ సారధ్యంలో జరిగిన తెదేపా భారీ బహిరంగ సభకు అంచనాలకు మించి ప్రజలు హాజరయ్యారని, అలాగే ఇటీవల కాకినాడలో నిర్వహించిన ధర్మ పోరాట సభకు కూడా అదే రీతిలో తరలి రావడం పార్టీపై ప్రజలకు చెక్కు చెదరని అభిమానాన్ని ప్రస్ఫుటం చేస్తోందన్నారు. ఇటీవల ఓ పార్టీ అధినేత జిల్లాకు వచ్చిన తరుణంలో నగదు ఇచ్చి ప్రజలను తరలించినట్లుగా ధర్మపోరాట సభకు తెదేపా నాయకులు తరలించలేదని, ఒక్కరికి కూడా నయాపైసా ఇవ్వకుండా వంద బస్సుల్లో స్వచ్ఛంధంగా ప్రజలు తరలి వచ్చి చంద్రబాబు నాయకత్వాన్ని బలపర్చారని అన్నారు. బస్సులు,భోజన వసతులు మాత్రమే పార్టీ సమకూర్చిందని, అయితే కొన్ని పత్రికలు అవాస్తవ కథనాలను ప్రచురించడం సరికాదని సవినయంగా తెలియజేస్తున్నానని గన్ని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అన్న క్యాంటిన్ల పట్ల ఊహించని స్పందన లభించిందని, అయితే కొంతమంది నాయకులు మాత్రం నాలుగేళ్ళ తర్వాత హామీలు గుర్తుకు వచ్చాయా అంటూ విమర్శలు చేయడం సరికాదన్నారు. నాలుగేళ్ళయినా విభజన చట్టంలోని హామీలను అమలు చేయని ప్రధాని మోడీని ఈ విమర్శకులు ఎందుకు నిలదీయరని ఆయన ప్రశ్నించారు