YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నలుగురు కొత్త రాజ్యసభ సభ్యులు

నలుగురు కొత్త రాజ్యసభ సభ్యులు
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజ్యసభకు నలుగురు సభ్యులను నామినేట్ చేశారు. ఆర్ఎస్ఎస్ వ్యూహకర్తగా పేరొందిన రాకేష్ సిన్హా, శాస్త్రీయ నాట్యంతో గుర్తింపు తెచ్చుకున్న సోనాల్ మన్‌సింగ్, శిల్పి రఘునాథ్ మహాపాత్ర, యూపీ మాజీ ఎంపీ, దళిత నాయకుడైన రామ్ షకల్‌లను కేంద్ర ప్రభుత్వ సిఫారసుతో కోవింద్ ఎంపీలుగా నామినేట్ చేశారు. సాహిత్యం, సమాజ సేవ, సైన్స్, కళలు తదితర రంగాల్లో విశేష సేవలు అందించిన లేదా నిష్ణాతులైన 12 మందిని రాజ్యసభకు నామినేట్ చేసే అధికారాన్ని రాజ్యాంగం రాష్ట్రపతికి కల్పించింది. ఒడిశాలోని పూరీకి చెందిన ప్రముఖ శిల్పి అయిన మహాపాత్ర.. 2016 నుంచి ఒడిశా లలిత కళా అకాడమీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2013లో పద్మ విభూషణ్ పురస్కారాన్ని సొంతం చేసుకున్న ఆయన భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ శిల్పాలను మలిచారు. ఒడిశాకే చెందిన సోనాల్ మాన్‌సింగ్ గత ఆరు దశాబ్దాలుగా భరతనాట్యం, ఒడిస్సీ నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. కూచిపూడి, మణిపూరి నృత్య ప్రదర్శనల్లోనూ ఆమె శిక్షణ పొందారు. సంగీత్ నాటక్ అకాడమీ చైర్‌పర్సన్‌గా పని చేసిన ఆమె ప్రస్తుతం ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ట్రస్టీగా సేవలు అందిస్తున్నారు. 2003లో పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకోవడం ద్వారా ఈ ఘనత సాధించిన రెండో భారత మహిళగా రికార్డులకెక్కారు. యూపీకి చెందిన రామ్ షకల్ రాబర్ట్స్‌గంజ్ నుంచి మూడుసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. రైతు నాయకుడిగా పేరొందిన ఈయన రైతులు, కార్మికులు సంక్షేమం కోసం పాటుపడ్డారు. దళితులు సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేశారు. ప్రొఫెసర్, రచయిత అయిన రాకేష్ సిన్హా ఢిల్లీకి చెందిన ఇండియా పాలసీ ఫౌండేషన్‌ (ఐపీఎఫ్) వ్యవస్థాపకులు. ప్రస్తుతం ఆయన ఐపీఎఫ్ గౌరవ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 2017నుంచి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నారు. 

Related Posts