వనం-మనం అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో రాష్ట్రంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీఎం సతీమరణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్‌తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సభలో ప్రతి ఒక్కరూ చెట్లను కాపాడాలంటూ ప్రతిజ్ఞ చేయించారు. మిగిలిన జిల్లాల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న.. ఈ వనం-మనం కార్యక్రమాన్ని 127రోజుల పాటూ నిర్వహించనున్నారు. దాదాపు 26కోట్ల మొక్కల్ని నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్ని జిల్లాల్లో ఎకో క్లబ్బులు కూడా మొక్కల పెంపకంపై అవగాహన కల్పించనున్నాయి. ఏపీలో 26శాతం పచ్చదనం ఉందని.. మరో పదేళ్లలో 50శాతానికి పెంచడమే లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ఓ బాధ్యతలా తీసుకోవాలని.. ప్రతి ఏటా 50కోట్ల మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రతి స్కూల్, ప్రభుత్వ ఆఫీస్‌లు, రోడ్లకు ఇరువైపులా మొక్కల్ని నాటాలని.. వాటిని నాటి వదిలేయకుండా వాటిని పెంచే బాధ్యత కూడా ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు. పచ్చదనం పెరిగితే రాష్ట్రం ఆహ్లాదకరంగా ఉంటుందని.. కాలుష్య కోరల్లో నుంచి బయటపడొచ్చన్నారు.