ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పడవ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద గోదావరిలో పడవ బోల్తా పడింది. ఆ పడవ తలారివారిపాలెం లంక నుంచి పశువుల్లంకకు బయల్దేరి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అందులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది సుమారు 10 మందిని స్థానిక గ్రామస్తులు కాపాడినట్లు సమాచారం. నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్‌ను నాటుపడవ బోల్తా ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు సహాయక చర్యలు చేపట్టడానికి బయలుదేరారు. ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. తక్షణం పూర్తి సమాచారం తెప్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు ఘటనా స్థలికి హుటాహుటిన వెళ్లాలని సీఎం ఆదేశించారు. గాలింపు, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు.