అందరు కలిసి ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలని, అన్నీ నేను చూసుకుంటానని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పార్టీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఏపీ నేతలతో అన్నారు. ఢిల్లీలో కిరణ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.కిరణ్ రెడ్డితో పాటు కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఊమెన్ చాందీ, పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రాహుల్ నేతలకు హితబోధ చేశారు. నేతలంతా కలసి ఎన్నికల్లో విజయం దిశగా కలసి పని చేయాలన్నారు.పార్టీలో సముచిత స్థానం ఇచ్చే అంశాన్ని తాను చూసుకుంటానని రాహుల్ గాంధీ అన్నారు. కాగా, కిరణ్ రెడ్డి చేరికతో కాంగ్రెస్కు బలం చేకూరుతుందని, పార్టీ వీడిన ఇతర నేతలను కూడా తీసుకు రావొచ్చునని భావిస్తున్నారు. తాను పార్టీలోకి రావాలంటే రాహుల్ గాంధీ ఆహ్వానించాలని కిరణ్ రెడ్డి.. పళ్లంరాజుతో చెప్పారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన అధినేత దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో ఆయన స్వయంగా ఆహ్వానించారు.విభజన నేపథ్యంలో ఆగ్రహంతో ఏపీ ప్రజలు 2014లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారు. అదే కారణంతో ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ఆ పార్టీలో చాలాకాలంగా ఉన్న నేతలు ఇతర పార్టీలలో చేరారు. పోగొట్టుకున్నచోటే వెతుక్కోవాలనే సామెతలా.. విభజనకు ప్రత్యామ్నాయం ప్రత్యేక హోదా అని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. ఆ హామీతో తిరిగి ఏపీలో పూర్వవైభవం పొందాలని కాంగ్రెస్ చూస్తోంది. అందుకే హోదాపై రాహుల్ కూడా స్వయంగా మాట ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కొందరు విభజన కారణంగా భావోద్వేగంతో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయారని ఆ పార్టీ ఏపీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా విభజన జరగకూడదన్న తపనతో పార్టీని వీడారని చెప్పారు. ఆయన తిరిగి రావడం వల్ల పార్టీకి మేలు జరుగుతుందన్నారు. వచ్చేసారి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేస్తుందన్నారు. విభజన తర్వాత రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిన కాంగ్రెస్ తిరిగి పుంజుకోవాలని ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగాకిరణ్ కుమార్ రెడ్డి సేవలు పార్టీకి అవసరమని నేతలు భావిస్తున్నారు. అందుకే సీనియర్ నేతలు పలు విడతలుగా ఆయనతో భేటీ అయి పార్టీలో చేరాలని కోరారు. సుదీర్ఘ మంతనాల అనంతరం ఆయన కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ను వీడి సొంత పార్టీ పెట్టుకున్న జగనే తమ టార్గెట్ అని చెబుతున్న నేతలు.. కిరణ్ చేరికతో ఆ దిశగా చర్యలు చేపట్టే అవకాశమున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విభజన తర్వాత కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీ వైపు వెళ్లింది. దానిని తిరిగి చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మంచి ఓటు బ్యాంక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.