YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

24 నుంచి పశ్చిమలో జనసేనాని

24 నుంచి పశ్చిమలో జనసేనాని
జనసేనాని పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ఖారారు అయ్యింది. ఉత్తరాంధ్ర పర్యటన విజయవంతంగా ముగించిన పవన్ కళ్యాణ్ కంటి ఇన్ఫెక్షన్ కు సంబంధించి ఆపరేషన్ చేయించుకుని వారం పాటు విశ్రాంతి తీసుకుని తిరిగి యాక్టివ్ కానున్నారు. ఆయన ఈనెల 24 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. పవన్ ఉత్తరాంధ్ర పర్యటన వినూత్న రీతిలో సాగింది. గంగపుత్రులతో కలిసి పూజలు చేసిన అనంతరం ఆయన కవాతు నిర్వహించి బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ వచ్చారు. వాటితోబాటు మారుమూల గిరిజన గ్రామాలు సందర్శించి గిరిపుత్రులతో మమేకం అయ్యారు. పదునైన ఆరోపణలు విమర్శలతో టిడిపి పై ఎక్కడికక్కడ విరుచుకుపడ్డారు. అధికారపార్టీని తన ప్రసంగాలతో ఉక్కిరిబిక్కిరి చేసేసారు. పవన్ చేసిన ఆరోపణల్లో చాలా గతంలో వైసిపి అధినేత జగన్ చేసినప్పటికీ నాలుగేళ్ళు టిడిపి తో కలిసి కాపురం చేసి విడాకులు తీసుకున్న జనసేనాని మాటలు తూటాల్లా జనంలోకి దూసుకుపోయాయి.పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు 2 పార్లమెంట్ స్థానాలను గత ఎన్నికల్లో టిడిపి, బిజెపి కూటమి క్లిన్ స్వీప్ చేసింది. ఆ విజయంలో జనసేన పాత్ర పూర్తి స్థాయిలో వుంది. కాపు సామాజికవర్గంలోని మెజారిటీ ఓటర్లు టిడిపి కూటమిని నాటి ఎన్నికల్లో బలపర్చడంతో అద్భుత విజయం తెలుగుదేశం అందుకోవడంతో బాటు ఏపీలో అధికారాన్ని దక్కించుకోవడంలో ప్రధాన భూమిక వహించింది పశ్చిమ గోదావరి జిల్లా.ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. జనసేన సొంతంగా రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటడానికి సిద్ధంగా వుంది. దాంతో పశ్చిమలో రాబోయే ఎన్నికలు అందరికి ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో పవన్ ప్రభావం అధికంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో పవన్ తన సొంత జిల్లాలో ఏ మేరకు సీట్లు సాధిస్తారు ? ఏ మేరకు అధికార టిడిపి విజయావకాశాలపై తన మార్క్ చూపిస్తారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఎవరి ఓట్లకు పవన్ గండి కొడతారన్న ఆసక్తి నెలకొని ఉంది. తొలుత తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించాలనుకున్న పవన్ మనసు మార్చుకుని పశ్చిమలోకి ఎంటర్ అవబోతున్నారు.

Related Posts