తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నగిరి ఎమ్మెల్యే రోజా సోమవారం దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకున్నారు. టిటిడి అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం తీర్ధ ప్రసాదాలు అందచేశారు అర్చకులు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రోజా టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయం పై మండిపడ్డారు. ఎన్నడూ లేని విధంగా మహాసంప్రోక్షణ పేరుతో స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించం, ఘాట్ రోడ్ నుంచి వాహనాలు రాకూడదు అని నిర్ణయాలు తీసుకోవడంతో రమణదీక్షితులు గారు చేసిన ఆరోపణలు వాస్తవమనిపిస్తుందని రోజా అన్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ పాలకమండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వివాదాస్పద నిర్ణయాలు తీసుకొని టీటీడీ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని రోజా విరుచుకుపడ్డారు. అధికారం ఉంది కదా అని భక్తులు స్వామి వారి దర్శనానికి రాకూడదని చెప్పడానికి వీరికి ఎవరు అధికారం ఇచ్చారని రోజా ప్రశ్నించారు. గతంలో జరిగిన మహాసంప్రోక్షణ సమయంలో కూడా భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారని రోజా తెలిపారు. మూడు వారాలకు ముందు జేఈవో 30వేల మందిని దర్శనానికి అనుమతిస్తామని చెప్పి, ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి తిరుమలకు ఎవరు రావడానికి వీలులేదు, సీసీ కెమెరాలు కూడా ఆపేస్తాం అంటే ఆగమశాస్త్రం అడ్డు చెప్పిందా లేక మీరేమైనా దొంగ పనులు చేస్తే అవి రికార్డ్ చేస్తాయని ఆపేస్తున్నార అని రోజా ప్రశ్నించారు. గతంలో దర్శనానికి ఎలాగైతే దర్శనానికి అనుమతించారో అలాగే ఈ మహాసంప్రోక్షణ కార్యక్రమం సమయంలో కూడా భక్తులను అనుమతించాలి లేకపోతే భక్తులను కూడగట్టుకొని టీటీడీని వ్యతిరేకిస్తామని ఆమె హెచ్చరించారు.