YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

ఖరీఫ్ రైతులను ముంచుతున్న వానలు

ఖరీఫ్ రైతులను ముంచుతున్న వానలు
వరుస వర్షాలు ఖరీఫ్ రైతులను నట్టేట ముంచుతున్నాయి. ఏకథాటిగా కురుస్తున్న వర్షాలకు జిల్లావ్యాప్తంగానే పొలాలన్నీ మడుగులుగా మారిపోతుండగా వాటిలో వేల రూపాయల ఖర్చుతో నాటిని నాట్లు మురిగిపోతూ రైతులను నష్టాలవైపు పరుగులు తీయిస్తున్నాయి. జిల్లాలో దాదాపుగా 5.50లక్షల ఎకరాల ఆయకట్టు ఖరీఫ్‌కు సిద్ధం కాగా దీనిలో రెండు,మూడురోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు 30శాతం వరకు దెబ్బతిన్నట్లు ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. అయితే వచ్చే రెండురోజులపాటు కూడా వర్షాలు కొనసాగితే మాత్రం ఈ నష్టాల శాతం మరింత భారీగా పెరిగిపోయే ప్రమాదం పొంచి ఉంది. వాస్తవానికి ఖరీఫ్ సీజన్ ప్రారంభంకాగా జూలై నెల దాదాపుగా సగానికి వచ్చేస్తున్న పరిస్దితుల్లో ఇప్పటికే వేసిన నాట్లు వర్షాల తాకిడికి దెబ్బతింటే ఖరీఫ్ భవిష్యత్‌పై ప్రశ్నార్ధకాలు కూడా లేచే పరిస్దితులు కన్పిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు మళ్లీ నాట్లు వేసి మళ్లీ పంటకు సిద్ధమయ్యే పరిస్దితి ఆచరణ సాధ్యం కాదనే చెప్పాలి. అలాంటప్పుడు ఇప్పటికే చేతికందే పరిస్దితికి వచ్చిన నాట్లు భారీవర్షాల కారణంగా వాననీటిలో మునిగి మురిగిపోతుంటే వాటిని కాపాడుకునే అవకాశాలు కూడా రైతుల వద్ద అతితక్కువని చెప్పాలి. జిల్లావ్యాప్తంగా గతంతో పోలిస్తే ఆక్వాసాగుపై మోజు, ప్రోత్సాహం భారీగా పెరిగిపోవటంతో పొలాల్లో పడిన నీరు కిందకు దిగే అవకాశాలు దారుణంగా తగ్గిపోయాయి. ఎక్కడికక్కడ చేపల చెర్వులు ఆవిర్భవించటంతో వాటిని దాటి వాననీరు కిందకు వెళ్లే అవకాశాలు లేకుండా పోయాయి. చివరకు ఆ నీరు అంతా పొలాల్లోనే ఉండిపోయి వేసిన నారును మురిగిపోయేలా చేస్తోంది. మరోవైపు రానున్న రెండు,మూడురోజులపాటు అల్పపీడనాలు కొనసాగటం, భారీ నుంచి అతిభారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెపుతుండటంతో రైతుల పరిస్ధితి మరింత అగమ్యగోచరంగా మారిపోయింది. ప్రధానంగా అల్పపీడన ప్రభావం ఉత్తరకోస్తాపై అధికంగా ఉంటుందని చెపుతున్నప్పటికీ ఆ ప్రభావంతో పశ్చిమలోనూ భారీవర్షాలు నమోదయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈపరిణామాలు రైతులను మాత్రం నట్టేట ముంచేదిశగానే సాగుతున్నట్లు కన్పిస్తోంది. ప్రస్తుతానికి వెయ్యి ఎకరాల్లో నారు దెబ్బతిన్నట్లు అధికారులు ఖరారు చేస్తున్నా ఈసంఖ్య మరింత అధికంగా ఉంటుందన్న అంచనాలు లేకపోలేదు. సాధారణ రైతుల పరిస్దితి ఇలాఉంటే కౌలురైతులు మరింత నిరాశా,నిస్పృహల్లో మునిగిపోతున్నారు. చివరకు కనీసం నారు సరఫరా అయినా చేయాలన్న డిమాండ్‌ను తెరపైకి తీసుకువస్తున్నారు. ఏదీఏమైనా కళ్లముందే భారీవర్షాల నడుమ ఖరీఫ్ కరిగిపోతుంటే రైతన్న దిగాలుగా ఉన్నాడు.

Related Posts