- ఫిబ్రవరి 2 ప్రేక్షకుల ముందుకు మాస్ మహారాజ్..
మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం టచ్ చేసి చూడు. రవితేజ ఎనర్జీకి తగినట్టుగా ఉన్న టైటిల్‌తో ఫిబ్రవరి 2 ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ సరసన సీరత్ కపూర్, రాశీఖన్నా నటించారు. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకొని రవితేజ తెలుగు ఫిల్మ్ బీట్‌తో మాట్లాడారు. రవితేజ వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే.. టచ్ చేసి చూడు చిత్రం ఏ రేంజ్ చిత్రం అనేది ఫిబ్రవరి 2వ తేదీన తెలుస్తుంది. గతంలో పోలీస్ పాత్రలను వేశాను. కానీ ఈ చిత్రంలో చిన్న ఫన్, కొంత వివేకం, మరికొంత వ్యంగ్యం కలిసి ఉన్న కొత్త పోలీసును చూస్తారు. ఓ రకంగా చెప్పాలంటే సీరియస్ పోలీస్ పాత్ర. దాంతో పాటు ఫ్యామిలీని బ్యాలెన్స్ ఎలా చేస్తాడనేది పాత్ర స్వభావం. రచయిత వక్కంతం వంశీ అందించిన కథను విక్రమ్ బాగా డీల్ చేశాడు.
టచ్ చేసి చూడు చిత్రంలో సీరత్ కపూర్‌ది డామినేటింగ్ క్యారెక్టర్. మోడరన్ అమ్మాయిలా కనిపిస్తుంది. సిటీ నేపథ్యం ఉన్నయువతిగా సీరత్ నటించింది. ఈ చిత్రంలో సీరత్ పాత్ర చాలా బాగుంటుంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ రాశీఖన్నా. రాశీది మెచ్చ్యూర్డ్ క్యారెక్టర్. నేను ఊహించినదానికన్నా ఎక్కువగా నటించింది. ప్రీతమ్ చక్రవర్తి జామెట్ అనే మ్యూజిక్ కంపెనీ పెట్టారు. అందులో సభ్యులు ఇచ్చిన ట్యూన్స్‌ను, సౌండ్ తీసుకొన్నాం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మణిశర్మ అందించారు.