YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

పొలిటికల్ ఎంట్రీకి గద్దర్ ప్రిపేర్

పొలిటికల్ ఎంట్రీకి గద్దర్ ప్రిపేర్
విప్లవ గాయకుడు గద్దర్ ఇక పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఎంపీగానో ఎమ్యెల్యే గానో చట్ట సభకు వెళ్లాలని ఉందని గద్దర్ తన మనసులో మాట వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ కి తెలుగు రాష్ట్రాల్లో విప్లవ గాయకుడిగా మంచి గుర్తింపు వుంది. మావోయిస్టు ల సానుభూతి పరుడిగా ప్రజా నాట్యమండలి కళాకారుడిగా ఆయన ఆడిపాడిన గీతాలు పండిత పామరుల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. కమ్యూనిస్ట్ భావజాలం వున్న గద్దర్ తెలంగాణ ఉద్యమంలో టి జేఏసీ లో చురుగ్గా వ్యవహరించారు. కేసీఆర్ సర్కార్ ఏర్పడ్డాకా ఆ ప్రభుత్వ వైఖరిని తొలినుంచి వ్యతిరేకిస్తూ ఇదేనా మనం కలలు కన్న బంగారు తెలంగాణ అంటూ ప్రశ్నిస్తూ వస్తున్నారు.తెలంగాణాలో ఎంతో కొంత ఉనికి వున్న కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు వ్యూహాత్మకంగా వచ్చే ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. గద్దర్ ను చట్ట సభకు పంపేందుకు సిపిఎం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆ పార్టీ నేత తమ్మినేని వీరభద్రం గద్దర్ చేసిన వ్యాఖ్యలను స్వాగతించారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయనకు సీటు గ్యారంటీ అన్నది ప్రకటించేశారు. అయితే గద్దర్ ఎక్కడినుంచి పోటీ చేయనున్నారు. ఎంపికా ఎమ్యెల్యేకా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. ప్రజల్లో గుర్తింపు వున్న వారికే సీట్లు కేటాయించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకునేలా కమ్యూనిస్ట్ లు ఇప్పటినుంచి పావులు కదుపుతున్నారు.ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలను ఏకంచేసి వాటిని బలోపేతం చేసేందుకు గద్దర్ వంటివారు మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. టిఆర్ ఎస్ వ్యతిరేక కూటమి రూపకల్పన లో కోదండరాం తో కలిసి గద్దర్ చురుకైన పాత్రే పోషిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గులాబీ దండుకు గట్టి పోటీ ఇచ్చేందుకు సాగుతున్న ఈ ప్రయత్నాలు ఏ మేరకు విజయవంతం అవుతాయో వేచిచూడాలి. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న దానిపై స్పష్టత లేకున్నా గద్దర్ బరిలోకి దిగడం ఖాయమని తేలింది. మరోవైపు గద్దర్ కుమారుడు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.

Related Posts