దేశీయంగా 5జీ టెలికం సేవలను త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ అనిల్ జైన్ తెలిపారు. ప్రపంచంలో ఏ దేశంలో 5జీ టెలికం సేవలను ప్రారంభించినా దాంతో పాటే దేశంలోనూ బీఎస్ఎన్ఎల్ ప్రారంభిస్తుందని హైదరాబాద్లో పేర్కొన్నారు. దేశంలో అన్ని సంస్థల కంటే ముందుగా తామే 5జీ సేవలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 5జీ టెలికం సేవలు జూన్ 2020 నాటికి ప్రారంభ కావచ్చునన్న అంచనాలున్నాయనీ.... అయితే 2019 నాటికే ప్రారంభమయ్యే వీలుందన్నారు.
గతంలో 4జీ సేవలను తొలుత ప్రారంభించే అవకాశాన్ని కోల్పోయామనీ, ఇప్పుడు 5జీ సేవలను ప్రారంభించే అవకాశాన్ని మాత్రం వదులుకోదలచుకోలేదని అనిల్ జైన్ చెప్పారు. 5జీ సేవలను పరిశీలించేందుకు నోకియా, ఎన్ టీటీ అడ్వాన్స్ టెక్నాలజీతో ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు తెలిపారు. వినియోగదారులకు మరిన్ని సేవలు అందించేందుకుగాను బీఎస్ఎన్ఎల్ నూతన ప్లాన్ లను ఆవిష్కరించింది. బీబీజీ యూఎల్డీ ప్లాన్లో భాగంగా 99, 199, 299, 491 రూపాయల రీఛార్జిపై ఆరు నెలల వారంటీతో ఏ నెట్వర్క్ కైనా ఉచితంగా 24 గంటలు అన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు జైన్ చెప్పారు.