YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోడీకి జైకొట్టిన నితీశ్ కుమార్.

మోడీకి జైకొట్టిన నితీశ్ కుమార్.

- ఆర్థిక సలహాదారు డయాగ్నసిస్‌ నివేదిక 

- మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం

-  ‘మాటలకే’ పరిమితమైంది..కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్ తివారీ

-  రైతుల కోసం తీసుకున్న చర్యలు చాలవు..మాజీ ప్రధాని దేవెగౌడ

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సాధారణ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. బడ్జెట్‌పై పలువురు నాయకులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ 2018: జైట్లీ.. రెండు భాషల్లో అనర్గళంగా.., బడ్జెట్ బ్రీఫ్‌కేస్ వెనక కథేమిటంటే... ఒకవైపు పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం కొనసాగుతుండగానే మరోవైపు మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ట్విట్టర్‌లో స్పందించగా, జైట్లీ బడ్జెట్ ప్రసంగం ముగిసిన తరువాత కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, సురేష్ ప్రభు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బడ్జెట్‌పై తమ స్పందన తెలియజేశారు.

చిదంబరం ఏమన్నారంటే... ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించగానే మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం మోడీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ బడ్జెట్‌ విషయమై ట్విటర్‌ వేదికగా వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రహ్మణ్యం బడ్జెట్‌ విషయంలో తన డయాగ్నసిస్‌ను వినిపించారు. మరి రోగి (ఆర్థిక శాఖ, మోడీ ప్రభుత్వం) దీని గురించి సరైన చర్యలు తీసుకుంటుందో, లేకపోతే పట్టించుకోకుండా వదిలేస్తుందో వేచి చూడాలి..' అంటూ మోడీ ప్రభుత్వంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఇది ఓ విఫల బడ్జెట్ అని, దానికి పూర్తి బాధ్యత అరుణ్ జైట్లీదేనని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం వ్యాఖ్యానించారు. ఆర్థిక పరీక్షలో జైట్లీ విఫలమయ్యారని, ఆ వైఫల్యం తీవ్రమైన అనేక పరిణామాలకు దారి తీస్తుందని అన్నారు.

కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ అసహనం వ్యక్తం చేసింది. రైతులకు అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ కేవలం ‘మాటలకే’ పరిమితమైందని కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్ తివారీ విమర్శించారు. ‘‘రైతులు, ఇతర ఉపాంత వర్గాలకు కేవలం మాటలతోనే ఉపశమనం కలిగించారు. ఇలాంటి సమయంలో అలాంటి బడ్జెట్ సరిపోదు. చాలా తక్కువే చేశారు’’ అని మనీశ్ తివారీ వ్యాఖ్యానించారు. ఇది ఓ విఫల బడ్జెట్ అని, దానికి పూర్తి బాధ్యత అరుణ్ జైట్లీదేనని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం వ్యాఖ్యానించారు. ఆర్థిక పరీక్షలో జైట్లీ విఫలమయ్యారని, ఆ వైఫల్యం తీవ్రమైన అనేక పరిణామాలకు దారి తీస్తుందని అన్నారు.

బడ్జెట్‌పై మాజీ ప్రధాని, జనతాదళ్ (ఎస్) అధినేత హెచ్‌డీ దేవెగౌడ అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల కోసం పథకాలు తీసుకొచ్చినా ఆశించిన స్థాయిలో లేవని, అది సరిపోదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. రైతుల జీవితాలు బాగు పడేందుకు కృషి చేసినా కూడా.. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, సాధారణ ప్రజల సమస్యలు ఎన్నో ఉన్నాయని అన్నారు. వారి కోసం బడ్జెట్‌లో తీసుకున్న చర్యలు సరిపోవన్నారు. 

అద్భుతమైన బడ్జెట్‌: నితిన్ గడ్కరీ ..కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అద్భుతమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని నితిన్ గడ్కరీ కొనియాడారు. ఇది దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన బడ్జెట్ అని ఆయన అన్నారు. అంతే కాకుండా బడ్జెట్‌లో ప్రకటించిన యూనివర్సల్ హెల్త్ స్కీమ్ దేశంలోని 40 శాతం మంది ప్రజలకు ప్రయోజకరంగా ఉందంటూ గడ్కరీ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. 

అర్థవంతమైన బడ్జెట్ అన్న సురేష్ ప్రభు.. కేంద్ర మంత్రి సురేష్ ప్రభు కూడా 2018-19 వార్షిక బడ్జెట్‌పై తన స్పందన తెలియజేశారు. ‘కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో రైతులు, వృద్ధులు, వ్యాపారవేత్తలు, పేదల సంస్కరణల గురించి ప్రస్తావించారు. కాబట్టి ఇది అర్థవంతమైన బడ్జెట్.. ' అని ఆయన కొనియాడారు. ఈ బడ్జెట్ కచ్చితంగా నూతన ఇండియాను ఆవిష్కరిస్తుందని సురేష్ ప్రభు ఆశాభావం వ్యక్తం చేశారు.

మోడీకి జైకొట్టిన నితీశ్ కుమార్... కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ స్పందించారు. మోడీ ప్రభుత్వానికి ఆయన జై కొట్టారు. విద్యా, ఆరోగ్యం, వ్యవసాయం విషయంలో మోడీ ప్రభుత్వం చెప్పుకోదగిన కేటాయింపులు చేసిందని కొనియాడారు. ముఖ్యంగా జాతీయ ఆరోగ్య భద్రతా పథకం భేష్‌ అని నితీశ్ అన్నారు. ఈ పథకం ద్వారా దేశంలో 10 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని ఇదో పెద్ద ముందడుగు అని నితీశ్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తాను ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.

Related Posts