YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నిర్లక్ష్యంపై పోరు

నిర్లక్ష్యంపై పోరు
పార్లమెంట్ వేదికగా కేంద్రంపై పోరాటానికి మరోసారి సిద్ధమైంది టీడీపీ. విభజన హామీలు, ప్రత్యక హోదాపై ఉభయసభల్లో గళం విప్పాలని నిర్ణయంచింది. అందుకే లేటెస్ట్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ అవిశ్వాస తీర్మానాన్ని ప్రయోగిస్తోంది. అంతేకాక మద్దతు కోసం పలు జాతీయ పార్టీల నేతలనూ కలిసింది. తమ పక్షాన నిలవాలని విజ్ఞప్తిచేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రజలు కోరుతున్నది చట్టబద్ధమైన హక్కులను అమలు చేయాలనే. దేశంలో భాగమై.. అధిక పన్నులు చెల్లించే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలపాలనే. కానీ.. అడిగే కొద్దీ రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తోంది కేంద్రం. ఇక.. ప్రధాని మోడీ వైఖరైతే.. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. నవ్యాంధ్ర విషయంలో ఆయనో చలనంలేని బండరాయిని తలపిస్తున్నారు. ఈ ధోరణి ఏమాత్రం సహించరానిది. దేశానికి తిండిపెట్టే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక స్థానం ఉంది. అన్నపూర్ణగా పేరుంది. ఇలాంటి రాష్ట్రాన్ని విస్మరించి..నిర్లక్ష్యం చేసి ఏం బావుకోవాలని అనుకుంటుందో బీజేపీకే తెలియాలి. బీజేపీ ప్లాన్ ఎలా ఉన్నా.. ఈ దఫా పార్లమెంట్ సమావేశాల్లో మాత్రం ఆ పార్టీకి చుక్కలు చూపించాలన్న పట్టుపై ఉంది టీడీపీ.
2014 జూన్‌ 2 నుంచి అమలులోకి వచ్చిన విభజన చట్టంలో 108 సెక్షన్లు, 13 షెడ్యూళ్ళు పొందుపరచి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అనేక హామీలు ఇచ్చారు. పార్లమెంట్‌ రూపొందించిన ఈ చట్టానికి రాజ్యాంగ బద్ధత, చట్టబద్ధత ఉన్నాయి. కానీ గత నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టంలోని ప్రధానాంశాలను అమలు చేయకుండా ఆంధ్రులకు అన్యాయం చేస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా 2014 ఫిబ్రవరిలో ఆనాటి ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఐదేళ్లపాటు ఇస్తామని ప్రకటించారు. 2014 మేలో ఏర్పడిన నరేంద్ర మోడీ సర్కార్ ఆ హామీని గౌరవించలేదు, అమలు చేయలేదు. 2016 సెప్టెంబర్‌ 7న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ఈ ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాక ప్యాకేజీ అమలుకూ ఆసక్తి చూపలేదు.
విభజన చట్టం 13వ షెడ్యూల్‌లో ఆంధ్రప్రదేశ్‌లో అనేక పరిశ్రమల స్థాపన గురించి పేర్కొన్నారు. దుగ్గరాజపట్నంలో భారీ నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేసి, 2018 కల్లా మొదటి దశ పూర్తి చేయాలి. కడపలో సమగ్ర ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పాలి. ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ ముడి చమురు శుద్ధి కర్మాగారం, పెట్రో రసాయన సముదాయాన్ని నెలకొల్పాలి. వైజాగ్‌–చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను, ఢిల్లీ–ముంబై పారిశ్రామిక కారిడార్‌ తరహాలో ఏర్పాటు చేయాలి. విభజన జరిగిన నాటి నుంచి 6 నెలల్లోగా నూతన రైల్వేజోన్‌ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలి. విశాఖపట్నం, విజయవాడలలో మెట్రోరైలు ఏర్పాటు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి. ఈ అంశాలను పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం ఒక్క పరిశ్రమ విషయంలో కూడా నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేదనే చెప్పొచ్చు. నాలుగేళ్లు గడచినా రైల్వేజోన్‌, ఉక్కు కర్మాగారం, ఓడరేవుల గురించి పట్టించుకోకపోవడం ఆంధ్రకు అన్యాయం చేయడమే.
విభజన చట్టం 13వ షెడ్యూలులో ఏపీ 11 జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుకూ నిధులు పూర్తిస్థాయిలో అందించలేదు. దీంతో పలు సంస్థలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. అనంతపురంలో సెంట్రల్‌ యూనివర్శిటీ, విజయనగరంలో గిరిజన యూనివర్శిటీలు అందుబాటులోకి రాలేదు. విభజన చట్టం 9, 10 షెడ్యూల్స్‌లో పొందుపరచిని ఇరు రాష్ట్రాల ఉమ్మడి సంస్థల ఆస్తుల పంపకాలూ కొలిక్కిరాలేదు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన గవర్నర్‌ నిర్దిష్ట విధానాలు రూపొందించి అమలు చేయలేదు. విభజన చట్టంలో సెక్షన్‌ 46(3) ప్రకారం రాయలసీమ, ఉత్తరకోస్తా జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీతోపాటు, తగిన ప్రోత్సాహకాలు కల్పించాలి. రాయలసీమ జిల్లాలైన కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, ఉత్తరకోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పారిశ్రామికాభివృద్ధిలో, తలసరి ఆదాయంలో, మానవాభివృద్దిలో వెనుకబడి ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు అన్ని అభివృద్ధి సూచీలలో 12,13 స్థానాలలో ఉన్నాయి. వీటి అభివృద్ధికి విదర్భ, బుందేల్‌ఖండ్‌ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి 25వేల కోట్ల రూపాయల వరకూ ఇవ్వవచ్చని ఆశిస్తే, కేంద్రం నుంచి మొండిచేయే ఎదురైంది. 2018–19 బడ్జెట్‌లో వెనుకబడిన జిల్లాలకు కేటాయింపులు కూడా లేవు.
విభజన చట్టంలో సెక్షన్‌ 94(3) ప్రకారం శాసనసభ, శాసనమండలి, రాజ్‌భవన్‌, హైకోర్టు, సచివాలయం లాంటి భవనాలతో పాటు ఇతర మౌలిక సదుపాయాలతో నిర్మించే రాజధాని అమరావతికి అవసరమైన ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని కేంద్రం అందించాలి. రాజధాని నిర్మాణానికి సుమారు 60 వేల కోట్లు కావాలని అంచనా. కానీ 2015 అక్టోబర్‌ 22న ప్రధానమంత్రి రాజధానికి శంకుస్థాపన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రం నుంచి వచ్చింది అంతంతమాత్రమే. ఇక విభజన చట్టంలోని సెక్షన్‌ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ ను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించి, ప్రాజెక్టు అభివృద్ధి, నియంత్రణ కేంద్రం తన పరిధిలోకి తీసుకున్నట్టు ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్టు సగానికిపైగా పూర్తైంది. ఇప్పటికీ పూర్తిస్థాయిలో కేంద్రం నుంచి నిధులు అందాల్సి ఉంది. రాష్ట్ర విభజన వలన ఆంధ్రప్రదేశ్‌కు ఏర్పడే రెవెన్యూ లోటును బడ్జెట్‌ కేటాయింపుల ద్వారా భర్తీ చేస్తామని 2014 ఫిబ్రవరి 20న ఆనాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభలో హామీ ఇచ్చారు. 2014–15 సంవత్సరానికి రెవెన్యూ లోటును 16,078 కోట్లుగా అకౌంటెంట్‌ జనరల్‌ తేల్చారు. ఈ లోటును పూడ్చేందుకు కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోంది. పార్లమెంటు చేసిన విభజన చట్ట హామీలను అమలు చేయవలసిన బాధ్యత కేంద్రంపై ఉంది. కానీ కేంద్రం ఈ బాధ్యతను విస్మరించింది. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా..వ్యవహరిస్తూ.. రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. 

Related Posts