ఇసుక మాఫియా ధనదాహం అమాయకుల ప్రాణాలను బలిగొంటోంది. అక్రమంగా ఇసుకను తరలిస్తూ వేగంగా వెళ్లే వాహనాల కింద నిండు జీవితాలు నలిగిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఇలాంటి విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అధికార టీడీపీ నాయకులే ఇసుక దందాలో కీలక సూత్రధారులుగా ఉండటంతో బాధిత కుటుంబాలు నిస్సహాయంగా మిగిలిపోతున్నాయి. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ విప్ చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు దాడికి తెగబడటం తెలిసిందే. ఇదే తరహాలో పలుచోట్ల అధికారులు, ప్రజలపై టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఇసుక దందాపై నిలదీసిన ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారు.ఇసుక మాఫియా ధనదాహం వందల ప్రాణాలను కబళిస్తున్నా సర్కారులో చలనం లేదు. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాలతోపాటు ఏరులు, కాలువల్లో యథేచ్చగా సాగుతున్న తవ్వకాలు, అక్రమ రవాణా జనం ప్రాణాలపైకి వస్తోంది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 11 మందికిపైగా మృతి చెందగా చిత్తూరు జిల్లాలో ఇసుక దిబ్బలు పడి ఏడుగురు, ఇసుక లారీ ఢీకొని 16 మంది మృత్యువాత పడ్డారు. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో 13 మందికిగాపైగా ఇసుక మాఫియాకు బలయ్యారు.చిత్తూరు జిల్లాలో భిన్నమైన పరిస్థితిలో ఇసుక మరణాలు సంభవించాయి. ఇసుక దిబ్బల కింద పడి నాలుగేళ్లలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి, గంగవరం, పలమనేరు, పెద్దపంజాణిల్లో ఈ ప్రమాదాలు జరిగాయి. నాణ్యమైన ఇసుక కోసం సొరంగం మాదిరిగా భూగర్భంలో తవ్వుతుండగా ఒక్కసారిగా దిబ్బలు విరిగి కూలీల మీద పడటంతో చనిపోతున్నారు. పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి, పుంగనూరు నియోజకవర్గం చెదళ్లలో ఇలాంటి ఘటనలు జరిగాయి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో గత ఏడాది ఏప్రిల్ 21న జరిగిన ఘటన కలకలం సృష్టించింది. స్వర్ణముఖిలో ఇసుక అక్రమ రవాణా ఆపాలంటూ మునగపాళ్యం రైతులు ఏర్పేడు తహశీల్దార్ ఆఫీసు వద్ద ధర్నాకు దిగారు. తహశీల్దార్ లేకపోవడంతో తిరుపతి అర్బన్ ఎస్పీని కలిసేందుకు ఏర్పేడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అదే సమయంలో ఓ లారీ హఠాత్తుగా రైతులపైకి దూసుకురావటంతో 16 మంది మరణించారు. 21 మంది తీవ్రంగా గాయపడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.