రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారిపోతుంటాయో చెప్పడం కష్టం. అదేవిధంగా ప్రజల మనోభావాలు కూడా అంతే. విశాఖ జిల్లాలో వైసీపీ నేతలను కలవర పెడుతోంది.అనూహ్యంగా పవన్ ఒంటరిగానే బరిలోకి దిగుతున్నానని చెప్పడం, అంతేకాకుండా.. ఉత్తరాంధ్రను టార్గెట్ చేయడంతో వైసీపీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. గత ఎన్నికల్లో పవన్ ప్రచారం చేస్తేనే తమకు ఉక్కిరి బిక్కిరి అయిందని, ఇప్పుడు ఏకంగా పవనే రంగంలోకి దిగడం, ఇక్కడ యువతను తనవైపు తిప్పుకోవడం వంటి పరిణామాలతో మళ్లీ విషయం మొదటికి వచ్చేఅవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ మెజారిటీ సీట్ల సాధనపై వారు తర్జన భర్జన పడుతున్నారు. మరో 20 రోజుల్లో ఇక్కడ జగన్ చేస్తున్న ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభం కానుంది. అప్పటికైనా పరిస్థితి ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని నేతలు భావిస్తున్నారు. మరి ఎంత మేరకు ఈ విషయంలో సఫలం అవుతారో చూడాలి. లేకుంటే.. 2014 ఎన్నికల్లో వచ్చిన ఫలితమే రావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ పెద్ద ఎత్తున పాగా వేయాలని నిర్ణయించుకుంది. ఈ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. అదేవిధంగా మూడు ఎంపీ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లోనే కనీసం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక ఎంపీ స్థానంలో సత్తా చాటాలని జగన్ నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా విశాఖ ఎంపీ సీటు, అదేవిధంగా మెజార్టీ అసెంబ్లీ సీట్లను ఖచ్చితంగా గెలుస్తామని భావించారు. ఇక, గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహించిన భీమిలిపైనా కన్నేశారు. ప్పటి ఎన్నికల్లో ఊహించని విధంగా వైసీపీకి పెను దెబ్బ తగిలింది. ఇక్కడ అనుకున్నది ఒక్కటి జరిగింది మరొకటి అన్న చందంగా పరిస్థితి మారిపోయింది. గెలుస్తామని గట్టిగా భావించిన ఎంపీ సీటును సైతం వదులుకోవాల్సి వచ్చింది. జగన్ తల్లి విజయలక్ష్మి స్వయానా ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు. ఇక, పాడేరు, అరకులోయ, మాడుగుల నియజకవర్గాలు మాత్రమే వైసీపీకి దక్కాయి. అయితే, వీటిలోనూ ఇప్పుడు పాడేరు ఎమ్మెల్యే వైసీపీకి ఝలక్ ఇచ్చి టీడీపీ పంచన చేరిపోయారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కూడా పార్టీ మారిపోయారు. దీంతో వచ్చే ఎన్నికలపై జగన్ పెద్ద ఎత్తున దృష్టి పెట్టారు. అయితే, ఇటీవల జరిగిన పరిణామాలు, వివిధ సర్వే సంస్థలు వెల్లడిస్తున్న అభిప్రాయాలూ చూస్తే.. వైసీపీకి గత ఎన్నికల నాటి రిజల్టే ఇక్కడ తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు.ఎన్నికల ఫలితాలను సమీక్షించిన వైసీపీ సీనియర్లు.. ఇక్కడ తాము గత ఎన్నికల్లో ఘోరంగా ఓటమిని చవిచూడడానికి ఓట్లు చీలడమే కారణమని గుర్తించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు తమకు అనుకూలంగా ఉంటుందని భావించిన కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యంగా విశాఖ ఎంపీ సీటులో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పురందేశ్వరి ఇక్కడ గెలుపొందారు. దీంతో ఇక్కడి కాంగ్రెస్ ఓట్లు వైసీపీకి పడతాయని జగన్ అండ్ కో భావించారు. అయితే, అనూహ్యంగా పవన్ రంగంలోకి దిగడం, టీడీపీ-బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేయడంతో ఆ ఓటు బ్యాంకు కాస్తా టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయిందని వైసీపీ నేతలు అంచనా కు వచ్చారు. అయితే, వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబుపై వ్యతిరేకత తమను గట్టెక్కిస్తుందని, కాంగ్రెస్ ఓటు బ్యాంకు తమ ఖాతాలోకి వచ్చి చేరుతుందని వారు అనుకున్నారు.