బడ్జెట్‌లో భిన్న వర్గాల వారికి అవకాశాలు కల్పించామని చెబుతున్నా ప్రతిపక్షాలు మాత్రం.. పెదవి విరుస్తున్నాయి. ఎవరి మాట ఎలా ఉన్నా.. ఉద్యోగినులు, సాధారణ మహిళలపై మాత్రం కేంద్రం కనికరం చూపించినట్టే ఉంది. మహిళా సాధికారత కోసం బడ్జెట్‌లో పలు ప్రకటనలు చేసింది. అవేంటో ఓ సారి లుక్కేస్తే...
మొత్తం రుణాల్లో 76 శాతం మహిళలవే. అందునా 50 శాతం దాకా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలవే అధికం. దానిని దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ముద్ర యోజన కింద మహిళలను మరింత ప్రోత్సహించేలా రుణ మొత్తాలను పెంచింది. ఉజ్వల యోజన కింద 8 కోట్ల మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు. ఇంతకుముందున్న 5 కోట్ల కనెక్షన్లను 8 కోట్లకు పెంచడం విశేషం. మహిళా స్వయం సహాయక గ్రూపులకు రుణాల్లో 37 శాతం పెంచారు.
ఉద్యోగినుల విషయానికొస్తే ప్రభుత్వం తరఫున 12 శాతం ఈపీఎఫ్‌ను ఇస్తామని కేంద్రం చెప్పింది. అయితే, మహిళలకు తమ జీతాల్లోంచి కట్ అయ్యే ప్రావిడెంట్ ఫండ్‌ను 12 శాతం నుంచి 8 శాతానికి కుదించింది. అంతేకాదు.. పీఎఫ్‌లో తగ్గింపు ఫలితంగా సంస్థలు అధికంగా మహిళలకు ప్రాధాన్యమిచ్చే అవకాశమూ ఏర్పడుతుంది.