మహా సంప్రోక్షణలో భాగంగా ఆలయాన్ని 6రోజుల పాటు మూసివేస్తామని టీటీడీ ప్రకటించింది. బాబు అనుమతి లేకుండా ఇలాంటి కీలక ప్రకటన రాదు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగిన వేళ.. తన అనుకూల మీడియాతో చంద్రబాబు దాన్ని బాగానే తొక్కిపెట్టగలిగారు. కానీ సోషల్ మీడియా మాత్రం ఊరుకోలేదు. సోషల్ మీడియా దెబ్బకు చంద్రబాబు దిగొచ్చారు. ఇప్పటికే తిరుమలలో శ్రీవారి ఆభరణాల మాయం విషయంలో చంద్రబాబు అండ్ కో, టీటీడీలో కొంతమంది అధికారులను భక్తులు అసహ్యించుకుంటున్నారు. తాజాగా మహా సంప్రోక్షణ కోసం ఎన్నడూ లేని విధంగా 6 రోజులపాటు ఆలయాన్ని మూసివేస్తామని ప్రకటించడంతో భక్తులతో సహా కొంతమంది ఆగమశాస్త్ర పండితులు ఇదెక్కడి నిర్ణయమంటూ ముక్కున వేలేసుకున్నారు.12 సంవత్సరాలకోసారి జరిగే మహా సంప్రోక్షణకు గతంలో ఎప్పుడూ ఆలయాన్ని మూసివేసిన చరిత్రలేదు. ఈసారి ఎందుకీ అత్యుత్సాహం? అసలు భక్తులను కొండపైకి రావద్దనడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. సామాజిక మాధ్యమంలో కూడా దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో మరోసారి శ్రీవారి విలువైన ఆభరణాలు, సంపదకు ఏమైనా ముప్పు పొంచిఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు దిద్దుబాటు చర్యలకు సిద్ధమయ్యారు. భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే అసలుకే ఎసరు వస్తుందనుకున్న బాబు, దర్శనాల విషయంలో వెనకడుగు వేశారు. మహా సంప్రోక్షణ కార్యక్రమంపై టీటీడీ అధికారులతో చర్చించిన బాబు, గతంలో మహా సంప్రోక్షణలో పాటించిన నిబంధనలనే అనుసరించాలని ఆదేశించారు. రోజుల తరబడి భక్తులు దర్శనానికి ఎదురుచూసేలా చేయొద్దని, మహా సంప్రోక్షణ రోజుల్లో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని సూచించారు.శ్రీవారి నగలు మాయమయ్యాయంటూ రమణ దీక్షితులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆయనపైనే పరువునష్టం కేసులుపెట్టి చావు తెలివితేటలు చూపిన చంద్రబాబు.. ఇప్పుడు టీటీడీ నిర్ణయం తన మెడకు చుట్టుకునే ప్రమాదాన్ని ముందే పసిగట్టారు. ఎన్నికల ఏడాది ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నా అది అధికారానికే ఎసరు తెస్తుందని బాబుకి బాగా తెలుసు. అందుకే దర్శనాల విషయంలో నిర్ణయం మార్చుకోవాలని టీటీడీని ఆదేశించారు