YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

హస్తినలో వేడెక్కిన విభజన రాజకీయాలు

హస్తినలో వేడెక్కిన విభజన రాజకీయాలు
తేల్చేసుకుందాం..మేం సిద్దం.. ఎవరి లెక్క ఎంతో లోక సభలోనే పక్కా చూద్దాం. రాజకీయమో, రణరంగమో ఈసారి వెనకడుగు లేదు. అంకెలు మాకు అనుకూలమే. సద్దు చేద్దామనుకుంటున్న మీ పద్దు కూడా గల్లంతవుతుంది అంటోంది బీజేపీ. లోక్ సభలో అవిశ్వాసతీర్మానంపై చర్చకు సై అంది. స్పీకర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అత్యంత కీలకమైన బడ్జెట్ సెషన్ మొత్తం వాషవుట్ అయిపోయినా నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహరించిన అధికారపార్టీ ఇప్పుడెందుకు ఆమోదం తెలిపింది. రెండు నెలలుగా దీనిపై ఆలోచన చేసిన తర్వాతనే అడుగు ముందుకు వేసింది. రాజకీయంగా ఎడ్జ్ సాధించేందుకు అవసరమైన కసరత్తు పూర్తి చేసుకుంది. ఇక ఎన్నికల శంఖారావం పూరించడానికి ప్రత్యేక వ్యూహంతో ఈ అవిశ్వాసాన్ని అంగీకరించినట్లుగా తేటతెల్లమవుతోంది. ప్రతిపక్షాల బలహీనతలు బయటపెట్టేందుకు, సర్కారీ సమర్థతను చాటుకునేందుకు నో కాన్ఫిడెన్స్ నిజమైన ప్లాట్ ఫామ్ గా మార్చుకోవాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఈ సవాల్ ను స్వీకరించినట్లు స్పష్టమవుతోంది.అవిశ్వాసాన్ని చేపట్టేందుకు పదిరోజుల వరకూ గడువు ఉన్నప్పటికీ వెంటనే తేల్చేయాలని బీజేపీ భావించింది. అంత గడువిస్తే విపక్షాలన్నీ చర్చలు జరుపుకుని పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఒక తాటిపైకి వస్తున్న విపక్షాలను జెండాలు, అజెండాల వారీగా విభజించాలనుకుంది. అవిశ్వాస తీర్మానం అంగీకరిస్తూ కేవలం తెలుగుదేశం పార్టీ పేరును మాత్రమే స్పీకర్ ప్రస్తావించారు. కాంగ్రెసును పట్టించుకోలేదు. ప్రధాన విపక్షమైన కాంగ్రెసును విస్మరించడంలోనే రాజకీయం దాగి ఉందంటున్నారు. టీడీపీ, కాంగ్రెసులు వేర్వేరు అజెండాలతో అవిశ్వాసంపై చర్చలో పాల్గొంటే సరిపోతుందని ఏ ఒక్క అంశమూ హైలైట్ కాదనేది పాలకపక్షం యోచన. టీఎంసీ, ఎస్పీ , ఎన్సీపీ, వామపక్షాల వంటివి సైతం వేర్వేరు పద్ధతుల్లో మాట్లాడితే అవిశ్వాస బలం వీగిపోతుందనుకుంటున్నారు. వామపక్షాలు గోరక్ష దాడులు, మతపరమైన అంశాలను ప్రస్తావించే అవకాశాలున్నాయి. కాంగ్రెసు మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాల ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకుంటూ మాట్లాడేందుకు ప్రయత్నించవచ్చు. రాష్ట్రవిభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదనేది టీడీపీ అవిశ్వాసానికి ప్రధాన ప్రాతిపదిక. మిగిలిన పార్టీలు ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోకపోతే తమ వాదన పేలవంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. బీజేపీకి కూడా కావాల్సిందదే.పేదలకు కోట్లాది బ్యాంకు అకౌంట్లు ప్రారంభించాం. ముద్ర యోజనతో వేల కోట్ల రూపాయల రుణాలిచ్చాం. కోట్ల సంఖ్యలో ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. దేశవ్యాప్తంగా మూలమూల గ్రామాల్లో విద్యుదీకరణ పూర్తి చేశాం.’ వంటి అజెండాతో తమ పాలన సామర్ధ్యాన్ని సంక్షేమంతో ముడిపెట్టి చాటుకోవాలని బీజేపీ భావిస్తోంది. అభివ్రుద్ధిని సాధికారికమైన లెక్కలతో చాటి చెప్పాలని, అందుకుగాను ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారని బీజేపీ ఉన్నత స్థాయి వర్గాల సమాచారం. ఆంధ్రప్రదేశ్ తోపాటు ఇతర రాష్ట్రాలకు మంజూరు చేసిన ప్రాజెక్టులు, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచిన తీరును దేశ ప్రజల ముందుకు తేవాలని యోచిస్తున్నారు. అవిశ్వాసంపై చర్చ సందర్బంగా పక్కా వ్యూహంతో పావులు కదపాలని అగ్రనాయకత్వం ఇప్పటికే మంత్రులకు ఆదేశాలు జారీ చేసింది. ఈసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే అంగీకరించి చర్చ జరపాలని గడచిన రెండు నెలలుగా కేంద్రప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రధాని ఈవిషయాన్ని ఇంటర్వ్యూల్లో సైతం చెప్పేశారు. దీనివల్ల విపక్షాలకే నష్టం వాటిల్లుతుందనే అంచనాలో ఉన్నారు. ఎన్డీఏ హయాంలో ఒక్క అవినీతి కుంభకోణం బయటికి రాకపోవడం, యూపీఏ కాలం నాటి పాపాలు కాంగ్రెసును ఇంకా వెన్నాడుతూనే ఉండటం ప్రభుత్వానికి ప్రజల్లో విశ్వాసం పెరిగేలా చేస్తాయంటున్నారు బీజేపీ నాయకులు.ఓడిపోయేది లేదు. ప్రభుత్వ సుస్థిరతకు వచ్చిన ప్రమాదమూ లేదు. ఎన్డీఏ కు 314 పైగా సభ్యుల మద్దతు ఉంది. యూపీఏ కూటమిలో కేవలం 66 మంది మాత్రమే ఉన్నారు. తెలుగుదేశం ఇతర పక్షాల బలమంతా కలిసినా 150కి కూడా చేరదు. పైపెచ్చు నిన్నామొన్నటివరకూ అసంత్రుప్తితో కుమిలిపోయిన శివసేన వంటి పార్టీలు టీడీపీ అవిశ్వాసాన్ని బలపరిచేది లేదని తేల్చి చెప్పేశాయి. గడచిన రెండు దశాబ్దాల్లో మూడుసార్లు అవిశ్వాసం చర్చకు వచ్చింది. అన్నిసార్లూ బీజేపీ నేత్రుత్వంలోని ప్రభుత్వంపైనే కావడం విశేషం. 1999లో జయలలిత మద్దతు ఉపసంహరించుకోవడంతో వాజపేయి నేత్రుత్వంలోని ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో గద్దె దిగింది. మళ్లీ 2003లో వాజపేయి ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకురాలు సోనియా గాంధీ అవిశ్వాసం ప్రతిపాదించారు. ప్రభుత్వం తన మద్దతును నిరూపించుకుంది. 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్లీ బీజేపీ సారథ్యంలోని మోడీ సర్కారు అవిశ్వాసం ఎధుర్కొంటోంది. ఎన్డీఏ తో సంబంధం లేకుండా సింగిల్ పార్టీగానే బీజేపీకి తగినంత బలం ఉంది. అందువల్ల మెజార్టీకి సంబంధించి కాకుండా కేవలం రాజకీయ అంశంగానే చర్చ సాగే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికలకు అన్నిపార్టీలు రంగం సిద్దం చేసుకుంటున్న నేపథ్యంలో పాలకపక్షం దీనిని తన పాలనకు అడ్వాంటేజీగా తీసుకోవాలని భావిస్తోంది. చీలికలు,పేలికలుగా ఉన్న విపక్షాలు సమర్థంగా తమ వాదనను వినిపించలేవని కమలనాథులు విశ్వసిస్తున్నారు. అవిశ్వాసపు విజిల్ వారు మోగిస్తే చర్చలోను, ప్రజల్లోనూ గెలుపు బజర్ తాము వినిపిస్తామని చివరి నవ్వు తమదేనని బీజేపీ నాయకులు ఘంటాపథంగా చెబుతున్నారు.

Related Posts