YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్ ను విలన్ చేస్తున్న కుమార...?

 కాంగ్రెస్ ను విలన్ చేస్తున్న కుమార...?
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డీ కుమారస్వామి ప్రవర్త ఇటీవల ఆసక్తికరంగా మారింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జేడీఎస్ తో పోల్చుకుంటే రెండింతల స్థానాలు వచ్చినా ముఖ్యమంత్రి పదవిని కుమారస్వామికి వదిలేసింది ఆ పార్టీ. కర్ణాటక కూడా బీజేపీ ఖాతాలో పడొద్దనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ఆ నిర్ణయం తీసుకుంది. మొత్తానికి 36 సీట్లతోనే కుమారస్వామి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమం వేదికగా దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకమైనట్లు కనిపించింది. కాంగ్రెస్ ఇందిలో పెద్దన్న పాత్ర పోషించింది. అయితే, జాతీయ రాజకీయాలు ఎలా ఉన్నా కర్ణాటకలో మాత్రం రెండు నెలల్లోనే రాజకీయాలు మారిపోతున్నాయి.ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రైతులకు రుణమాఫీ విషయంలో కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు మొదలు తాజాగా, జేడీఎస్ కార్యకర్తలు ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో కంటతడి పెట్టడం వరకు ఆయన వైఖరి చూస్తుంటే ఏదో రాజకీయ ప్రయోజనం ఉందా అని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారం చేపట్టిన వారం రోజులకే రుణమాఫీపై ప్రశ్నిస్తే…‘తనకు పూర్తి మెజారిటీ లేదని, కాంగ్రెస్ ను అడిగే నిర్ణయం తీసుకోవాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. తర్వాత కూడా రెండుమూడు సందర్భాల్లో తనకు స్వతంత్రం లేదని, కాంగ్రెస్ దే పెత్తనం అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ఇక తాజాగా, జేడీఎస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ…‘మీరు సంతోషంగా ఉన్నా, నేను సంతోషంగా లేను. గరళాన్ని కంఠంలో దాచుకున్న శివుడు ఎంత బాధ అనేభవించాడో…తానూ అంతే బాధ అనుభవిస్తున్నాను’ అని చెప్పి కంటతడి పెట్టుకున్నారు. ఈ పరిణామం కూడా ప్రజల్లో కుమారస్వామికి సానుభూతి పెంచడంతో పాటు కాంగ్రెస్ పై వ్యతిరేకత వచ్చేలా చేస్తోంది.బీజేపీ అధికారం చేపట్టవద్దని కుమారస్వామిని గద్దెనెక్కిస్తే ఇప్పుడు ఇన్ డైరెక్ట్ గా తమ పార్టీనే విలన్ చేస్తున్నా కాంగ్రెస్ నేతలకు ఇంకా పట్టడం లేదు. 2019 వరకు కర్ణాటకలో ప్రభుత్వంలో ఉండటం, జేడీఎస్ తో పొత్తు కొనసాగించడం ఆ పార్టీకి అవసరం. ఈ పరిస్థితినే కుమారస్వామి తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అయితే, కుమారస్వామి ఎత్తుల వల్ల ఆ పార్టీకి అసలుకే ఏసరు వస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయి. కుమారస్వామి చర్యలు చూస్తుంటే కాంగ్రెస్ ను బలహీనపర్చి తాను బలపడాలనే ఆలోచన కనిపిస్తోంది. ఆయన అనుకున్నది అనుకున్నట్లు జరిగితే కర్ణాటకలో ఎక్కువ లోక్ సభ స్థానాలు సాధించి కేంద్రంలో కీలకపాత్ర పోషించాలని భావిస్తున్నారు. అవకాశం వస్తే తన తండ్రి దేవెగౌడను మరోసారి ప్రధానమంత్రిగా చూడవచ్చని ఆయన ఆశ. ఇందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మానసపుత్రిక లాంటి అన్నభాగ్య పథకానికి ప్రాధాన్యత తగ్గిస్తున్నారు. ప్రజలకు మేలు చేసే ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే తన చేతిలో అధికారంలో లేదని ఒకవిధంగా కాంగ్రెస్ పై నేపం నెట్టేస్తున్నారు. తరచూ తనకు పూర్తి మెజారిటీ ఇవ్వలేదని చెబుతూ…2019 పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, కర్ణాటకలో బీజేపీకి చెక్కు చెదరని బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఒకవేళ కుమారస్వామికి గనుక ఓటుబ్యాంకు పెరిగితే, అది కాంగ్రెస్ ఓట్లు తగ్గిపోయినట్లే. అయితే, మిత్రుడే తనకు అంతర్గత శత్రువుగా మారి..తమకే చేటు తెస్తున్నారనే విషయాన్ని కాంగ్రెస్ ఎప్పటికి గ్రహిస్తుందో మరి.

Related Posts