చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీల తాకిడిని తట్టుకోలేక భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ నుంచి ఓ ప్రముఖ కంపెనీ కనుమరుగు కాబోతుంది. హెచ్‌టీసీ భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు గుడ్‌బై చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. హెచ్‌టీసీ టాప్ మేనేజ్‌మెంట్ కంట్రీ హెడ్ సిద్ధిఖీ, సేల్స్ హెడ్ విజయ్ బాలచంద్రన్, ప్రొడక్ట్ హెడ్ ఆర్.నయ్యర్ ముగ్గురూ ఒకేసారి రాజీనామా చేసినట్టు తెలిసింది. అంతేకాక మరో 70 నుంచి 80 మంది ఉద్యోగులకు కూడా కంపెనీ సెటిల్‌మెంట్ చేస్తుందని వెల్లడైంది. నాణ్యతకు మారుపేరుగా ఉన్న హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు ఇటీవల కాలంలో భారీగా తగ్గాయి. చైనా స్మార్ట్‌ఫోన్ల నుంచి వస్తున్న పోటీని తట్టుకోలేక హెచ్‌టీసీ అమ్మకాలు భారీగా పడిపోయాయి. చాలా మార్కెట్లలో హెచ్‌టీసీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ తయారీ యూనిట్లను మూసివేస్తూ వస్తోంది.