తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నియోజకవర్గం తిరువూరులో అనూహ్య రాజకీయ మార్పులు చోటుచేసుకోబోతున్నాయా..? అంటే తాజా పరిస్థితులు ఔననే అంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ఎమ్మెల్యే ఏపీ అసెంబ్లీ రేసులో ఉంటారన్న ప్రచారం జోరందుకుంది. కృష్ణాజిల్లా తిరువూరు నియోజవకర్గ నుంచి ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణ టీడీపీలో మిగిలిన ఒకే ఒక్క ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కావడం గమనార్హం. గత ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు, మల్కాజ్‌గిరి ఎంపీ గెలిచారు. ఇప్పుడు వారంతా కారెక్కేశారు. ఒక్క సండ్ర వెంకట వీరయ్య మాత్రమే ఇంకా టీడీపీని పట్టుకుని వేలాడుతున్నారు.తెలంగాణలో టీడీపీకి మిగిలిన ఎమ్మెల్యేగా ఉన్న సండ్రపై టీఆర్ఎస్ నుంచి ఎన్నో ఒత్తిళ్లు వచ్చినా ఆయన పార్టీ మారలేదు. అంతేగాకుండా.. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సండ్ర నమ్మకస్తుడనే గుర్తింపు ఉంది. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలందరూ అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్‌లోకి వెళ్లినా.. సండ్ర వెంకటవీరయ్య మాత్రం పార్టీని నమ్ముకుని ఉంటున్నారు. అసెంబ్లీలో టీడీపీ వాయిస్ వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సండ్రకు టీటీడీ పాలకమండలిలో సభ్యుడిగా చంద్రబాబు అవకాశం కల్పించారు. ఎస్సీ సామాజికవర్గంలోనూ ఆయనకు మంచి పట్టు ఉంది. బలమైన వాయిస్ ఉన్న నేత. ఈ క్రమంలోనే అలాంటి వ్యక్తిని పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఏపీలో పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్న స్వయంగా చంద్రబాబే ఆలోచన చేస్తున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం సండ్ర వీరయ్య ఎమ్మెల్యేగా ఉన్న సత్తుపల్లి నియోజకవర్గానికే ఆనుకుని ఉన్న తిరువూరు అసెంబ్లీ స్థానం నుంచి సండ్ర వెంకటవీరయ్య బరిలోకి దిగే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ ఎలాగూ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే స్కోప్ లేదు. ఈ క్రమంలో అక్కడ పార్టీని నమ్ముకుని, బలమైన వ్యక్తిగా ఉన్న సండ్రను ఏపీలో పోటీ చేయించడంతో పాటు సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చే అంశం కూడా పార్టీ ముఖ్యనేతల వద్ద చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన సత్తుపల్లి నుంచి 2009, 2014లో వరుసగా గెలుస్తూనే ఉన్నారు.ప్రస్తుతం తిరువూరుకు వైసీపీ నేత కొక్కిలిగడ్డ రక్షణనిధి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఈ సారి తన సొంత నియోజకవర్గం అయిన పామర్రు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత స్వామిదాస్‌పై కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. పని కోసం వచ్చిన వారితో, పార్టీ కార్యకర్తలతో ఆయన దురుసుగా ప్రవర్తిస్తారనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఇక్కడ వరుసగా మూడుసార్లు ఓడిపోతూ వస్తున్నారు.ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన తిరువూరు నుంచి సండ్ర వెంకటవీరయ్యను బరిలోకి దించితే విజయం ఖాయమనే భావన టీడీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు నమ్మకస్తుడుకావడం కూడా సండ్రకు కలిసొస్తుందని పలువురు నాయకులు అంటున్నారు. ఇదిలా ఉండగా.. గత ఎన్నికల తర్వాత తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే రక్షణనిధి టీడీపీలోకి రావడానికి ప్రయత్నం చేస్తే మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ అడ్డుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆయనొస్తే.. తనకు టికెట్ దక్కదనే అంచనాతో స్వామిదాస్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. ఇప్పుడు సత్తుపల్లి ఎమ్మెల్యే, టీడీపీ నేత సండ్ర వెంకటవీరయ్యను స్వామిదాస్ ఇక్కడికి రానిస్తారా..? లేదా అన్న సందేహం ఉన్నా ఇప్పటికే మూడుసార్లు ఓడడంతో ఆయన్ను పక్కన పెట్టేయాలని అధిష్టానం డెసిషన్ తీసుకున్నట్టే తెలుస్తోంది. మరి ఎన్నికల నాటికి ఈ పరిణామాలు ఎలా మారతాయో ? చూడాలి.