ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే నానుడిని మరోసారి రుజువు చేసి చూపించారు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్! గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లను సమీక్షించుకుని.. ఈసారి విజయమే లక్ష్యంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చాలా వరకూ పార్టీ బలాన్ని పెంచుతున్నాయి. ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరు పోటీపడటం.. ఒకరికి టికెట్ ఇస్తే మరొక వర్గం.. సహాయ నిరాకరణ చేయడం వల్ల గత ఏడాది చాలా స్థానాల్లో తక్కువ మెజారిటీతో సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఫలితంగా గెలిచే నియోజకవర్గాల్లోనూ వర్గ పోరు.. పార్టీ విజయావకాశాలు దెబ్బతీసింది. అందుకే ఈసారి అలాంటి నియోజకవర్గాలపై దృష్టిపెట్టారు జగన్. ఇద్దరికీ సముచిత స్థానం కల్పించి.. వేర్వేరుగా ఉన్న నేతలను ఏకతాటిపైకి వచ్చేలా చేయడంలో సఫలమయ్యారు. ఈ నిర్ణయాలు టీడీపీ నాయకుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి ఎవరిని బరిలోకి దింపాలనే విషయంలో జగన్ నిర్ణయం ఆసక్తికరంగా మారింది.శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో టెక్కలి, పలాస, పాతపట్నం, ఇచ్ఛాపురం, ఆమదాలవలస, నరసన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా కాళింగులు, వెలమ ప్రధాన సామాజికవర్గాలు. ఈ నియోజకవర్గం నుంచి బొడ్డేపల్లి రాజగోపాల్ కాంగ్రెస్ నుంచి ఎక్కువ సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఇక టీడీపీ ఆవిర్భావంతో.. కాంగ్రెస్ హవా పడిపోయింది. కింజరాపు కుటుంబం నుంచి ఎర్రన్నాయుడు ఎక్కువసార్లు గెలుపొందారు. ఎర్రన్నాయుడు మరణానంతరం.. ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడు 2014 ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. ఇక వైఎస్సార్ సీపీ తరఫున రెడ్డి శాంతి పోటీ చేశారు. 1.24లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎర్రన్నాయుడిపై సానుభూతితో పాటు.. టీడీపీ హవా కొనసాగడంతో వైసీపీ గట్టి పోటీ ఇచ్చినా అంతగా ప్రభావం చూపలేకపోయింది.ఇదే సమయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు కూడా ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ప్రభావం చూపాయి. ప్రధానంగా ఈ జిల్లా నుంచి సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం.. వైఎస్సార్ సీపీకి బలమైన నాయకులుగా ఉన్నారు. వీరిలో ఎవరినైనా పార్లమెంటుకు పంపాలనే ఆలోచన చేసినా.. వీరు మాత్రం నియోజకవర్గాలకే పరిమితం అవ్వడంతో జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న రెడ్డి శాంతిని బరిలోకి దింపారు. ఇక ఇదే పార్లమెంటు పరిధిలోని టెక్కలి నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు గెలిచి మంత్రి అయ్యారు. ఆయన దువ్వాడ శ్రీనుపై 7 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. గత ఎన్నికల తర్వాత వైసీపీలో గ్రూపు రాజకీయం తారాస్థాయికి చేరింది. సీటు కోసం ముందుగా టెక్కలి నుంచి గత ఎన్నికల్లో ఓడిన దువ్వాడ శ్రీనుతో పాటు మరో నేత పేరాడ తిలక్ పోటీపడ్డారు. స్థానికంగా బలం ఉండటంతో పాటు కళింగ సామాజికవర్గానికి చెందిన.. దువ్వాడ శ్రీనుకు టికెట్ ఇస్తారని భావించినా.. తిలక్‌కే టికెట్ ఇచ్చారు. దీంతో శ్రీను వర్గం తిలక్‌కు సహాయ నిరాకరణ చేయడంతో వైసీపీ ఇక్కడ మంత్రికి పోటీ ఇచ్చే పరిస్ధితి లేక చేతులు ఎత్తేసింది.ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో.. శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి ఎవరిని బరిలోకి దించాలనే విషయంపై జగన్ క్లారిటీతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. సామాజిక వర్గ పరం, రాజకీయ విభేదాల పరంగా ఆలోచించి.. దువ్వాడ శ్రీనును శ్రీకాకుళం పార్లమెంటరీ సమన్వయకర్తగా నియమించారు జగన్! దీంతో అటు టెక్కలి లో తిలక్‌కు పోటీ లేకుండా చేశారు. ఇదే సమయంలో సామాజికవర్గ పరంగా టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడిపై బలమైన అభ్యర్థిని రంగంలోకి దించారు. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో రామ్మోహన్‌నాయుడు కొప్పవెలమ సామాజికవర్గం ఓటర్ల కన్నా కళింగ వర్గ ఓటర్లే చాలా ఎక్కువ. అయితే ఈ సారి అక్కడ కుల ప్రభావం బాగా పనిచేసే ఛాన్సులు ఉండడంతో అటు ఎంపీ సీటుకు, ఇటు టెక్కలి సీటుకు ఇదే సూత్రాన్ని పాటించిన జగన్ టెక్కలి వివాదాన్ని పరిష్కరించడంతో రెండు చోట్ల బలమైన అభ్యర్థులను నిలబెట్టినట్లయ్యింది.ఇక దువ్వాడ శ్రీను ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో.. శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అంతేగాక సీనియర్లు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలతో తరచూ సమావేశమవుతూ.. వ్యక్తిగతంగా బలం మరింత పెంచుకుంటున్నారు. గతసారి టఫ్ ఫైట్ మిస్సయినా.. ఈసారి మాత్రం శ్రీకాకుళం ఎంపీ స్థానంలో టీడీపీ-వైసీపీ మధ్య హోరాహోరీ తప్పదంటున్నారు విశ్లేషకులు!