బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నిన్న తన ట్విట్టర్‌లో తొంభై సెకన్ల ప్రకటనని పోస్ట్ చేస్తూ.. ఇది చూస్తుంటే చాలా ఎమోషనల్‌గా ఉంది. నా కంట్లో కన్నీళ్ళు ఆగడం లేదు, కూతుళ్లే బెస్ట్ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ యాడ్‌తోనే అమితాబ్ కూతురు శ్వేతానంద్ తొలిసారి స్క్రీన్ ముందుకు వచ్చింది. ప్రముఖ నగల దుకాణం ప్రచారంలో భాగంగా వీరిద్దరు కలిసి నటించారు. తెలుగులో నాగార్జున ఈ ప్రకటనలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఈ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రకటన బ్యాంకింగ్ వ్యవస్థని దెబ్బతీసేలా ఉందంటూ ఏఐబీసీవో ప్రధాన కార్యదర్శి సౌమ్య దత్తా అన్నారు. ఈ విషయంలో కోర్టుకి కూడా వెళతామని పేర్కొన్నారు. మూడు లక్షల ఇరవైవేల మంది ఆఫీసర్స్ ఏఐబీసీవోలో సభ్యత్వం కలిగి ఉన్నారు. మేమందరం కలిసి ఆభరణాల సంస్థపై దావా వేయాలని అనుకుంటున్నామని తెలిపారు. ఈ ప్రకటన లక్షలాది బ్యాంక్ కస్టమర్స్ మనోభావాలని దెబ్బతీసేలా ఉందని వారు వాపోతున్నారు. అయితే వారి వాదనలని తోసిపుచ్చిన ఆభరణాల సంస్థ ఇది కేవలం ప్రకటన చిత్రమేనని ఇందులో ఏ మాత్రం వాస్తవికత లేదంటూ కంపెనీ ప్రతినిధులు సౌమ్య దత్తాకు లేఖ రాశారు. మలయాళంలోను ఈ యాడ్ ప్రసారం అవుతుండగా శ్వేతానంద ప్లేస్‌లో మంజూవారియర్ నటించారు. ఇక తెలుగులో అక్కినేని నాగార్జున నటించారు