YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జేడీతో హర్షకుమార్ భేటీ వెనుక ఆంతర్యం

జేడీతో హర్షకుమార్ భేటీ వెనుక ఆంతర్యం
అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యుడు జీవీ హర్ష కుమార్ తో సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఒక ప్రయివేట్ కార్యక్రమంలో విద్యార్థులతో సదస్సులో పాల్గొనేందుకు లక్ష్మీనారాయణ రాజమండ్రి వచ్చారు. ఆ కార్యక్రమం అనంతరం ఆయన మాజీ ఎంపీ హర్ష కుమార్ ఇంటికి వెళ్లి రాత్రి కలిశారు. వారింట్లోనే డిన్నర్ చేశారు. వారిద్దరూ మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెబుతున్నా ఇద్దరి నడుమ రాజకీయ చర్చలే ప్రధానంగా నడిచినట్లు తెలుస్తుంది. కొద్ది కాలంగా రాజకీయాలపై పెదవి విప్పని జెడి సరికొత్త రీతిలో రాజకీయ నేతలతో భేటీ కావడం విశేషమే.లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేశాక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తారన్న ప్రచారం నడిచింది. ఆయన కూడా తదనుగుణంగా అడుగులు వేసినట్లే కనిపించారు. రైతులతో సమావేశాలు, శ్రీకాకుళం వంటి మారుమూల ప్రాంతాల్లో పర్యటనలు , జెడి ఎప్పుడు పాల్గొనే విద్యార్థులతో కళాశాలల్లో ఇంటరాక్షన్ చక చక నడిచిపోయాయి. ఇవన్నీ ఆయన త్వరలో పొలిటికల్ ఎంట్రీకి మార్గాలే అని రాజకీయ పరిశీలకులు భావించారు. అయితే కొద్ది రోజులు తరువాత ఆయన యాక్టివిటీ తగ్గిస్తూ వచ్చారు. ముఖ్యంగా రాజకీయాల వైపు, ఏ పార్టీలో చేరే దిశగా ఆలోచనలు లేవనే అంతా భావించారు. కానీ ఇప్పుడు జెడి రాష్ట్రంలోని కీలక నేతలను ఎందుకు కలుస్తున్నట్లు అన్న చర్చ మొదలైంది.మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, హర్ష కుమార్ చెట్టా పట్టాలు వేసుకు తిరుగుతున్నారు. వీరితో తిరుపతి మాజీ ఎంపి చింతా మోహన్ కలిసే వుంటున్నారు. ఈ గ్రూప్ తో ఇప్పుడు జెడి కూడా జత కడతారా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఇంకా ఏ పార్టీలోకి వెళుతున్నారో ప్రకటించని హర్ష కుమార్ కాంగ్రెస్ అధిష్టానం నుంచి వచ్చిన పిలుపుపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. దళిత సమస్యలపైనా, అట్రాసిటీ చట్టంపై సుప్రీం ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. టిడిపి సర్కార్ ఆయన పెట్టిన మిలీయ‌న్‌ మార్చ్ కి అనుమతి నిరాకరిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు గుమ్మం తొక్కినా పని జరగలేదు. మరోసారి కోర్ట్ ను ఆశ్రయిస్తానని పోలీసుల చేత వ్యతిరేకంగా కౌంటర్ దాఖలు చేయిస్తే ప్రభుత్వం సంగతి తేల్చేస్తానంటూ ఇటీవలే హెచ్చరించారు. ఈ నెలలోనే తాను ఏ పార్టీ లోకి వెళ్ళేది చెప్పేస్తానని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఇంకా ఏ పార్టీనో ప్రకటించని జెడి… హర్ష కలయిక భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

Related Posts