బ్యానర్: రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్
తారాగణం: ఉదయ్ శంకర్, దొడ్డన్న, ‘హైపర్’ ఆది, ‘చలాకీ’ చంటి, చమ్మక్ చంద్ర తదితరులు
సంగీతం: వాసుకీ వైభవ్
నేపథ్య సంగీతం: నోబిన్ పాల్
ఎడిటింగ్: నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ: లవిత్
నిర్మాత: రాక్‌లైన్ వెంకటేశ్
దర్శకత్వం: చంద్ర సిద్ధార్థ
చంద్రసిద్ధార్థ పేరు వినగానే ఇప్పటికీ గుర్తొచ్చే సినిమా ‘ఆ నలుగురు’. ఆ తర్వాత అందరి బంధువయ. ఆయన సినిమాలు అనగానే విలువలు, మంచితనం, మానవత్వం, నాలుగు మంచి మాటలు గుర్తుకొస్తాయి. ఎంత కమర్షియల్ సినిమాను ఆకాశంలో ఉండేలా తెరకెక్కించినా, పునాదిని మర్చిపోని దర్శకుడు చంద్రసిద్ధార్థ. స్క్రీన్‌ప్లే విషయంలోనూ ఆయన మార్కు ఉంటుంది. ఇప్పటిదాకా సొంత కథలతోనూ, పరుల కథలతోనూ సినిమాను రూపొందించిన ఆయన తొలిసారి ఓ కన్నడ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. కన్నడంలోసూపర్ హిట్ అయిన ఆ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎంత వరకు నచ్చుతుంది? ఓసారి చూద్దాం..
కథ
గాజులమర్రి బాబ్జీ( ఉదయ శంకర్)కి ఓ వ్యక్తిని చంపిన కారణంగా ఉరిశిక్ష పడుతుంది. శిక్ష అమలు చేయడానికి ఇంకో నాలుగు రోజులు ఉందనగా అతను జైల్లో సెంట్రీని కొట్టి తప్పించుకుంటాడు. దారిలో ఓ లారీలో ఎక్కుతాడు. అది పంక్చర్ కావడంతో ఆ వైపుగా వెళ్తున్న జంగయ్య (దొడ్డన్న)ను కలుసుకుంటాడు. ఇంతకీ జంగయ్య మరెవరో కాదు... బాబ్జీకి ఉరిశిక్షను అమలు చేయడానికి బయలుదేరిన తలారి. మామూలుగా పశువులకు వైద్యం చేసే ఆయన, జైలు నుంచి పిలుపు అందిన ప్రతిసారీ తలారి పనులు చేస్తుంటాడు. ఆ ప్రయాణంలోనే వారికి ఇంటినుంచి పారిపోయి వచ్చిన ప్రేమికులు ఆది, అతని ప్రేయసి కనిపిస్తారు. మరి కొంత దూరం ప్రయాణం తర్వాత వారికి ఓ నిండుచూలాలు కనిపిస్తుంది. ఇంత ప్రయాణం పూర్తయిన తర్వాత బాబ్జీకి ఏమైంది? జంగయ్య అతన్ని ఉరితీశాడా? లేదా? వంటివి ఆసక్తికరమైన అంశాలు..
ప్లస్ పాయింట్లు
- నటీనటుల నటన
- సంగీతం, లొకేషన్లు
- కొన్ని మాటలు
- పాటలు, రీరికార్డింగ్
- భావోద్వేగాలు
మైనస్ పాయింట్లు
- నెమ్మదిగా సాగిన స్క్రీన్‌ప్లే
- రెగ్యులర్ కమర్షియల్ అంశాలకు దూరంగా ఉండటం
- సన్నటి కథ
విశ్లేషణ
ఉరి తీయాల్సిన వ్యక్తి, ఉరి కంబం ఎక్కాల్సిన వ్యక్తి కలిసి చేసిన ప్రయాణం, మధ్యలో వారికి తగిలిన వ్యక్తులు, కొన్ని క్షణాల బంధుత్వాలు, కొన్ని భావోద్వేగాలు కలిసి ఈ సినిమా. ఈ చిత్రాన్ని కథగా చెప్పడం కన్నాఆ క్లిష్టమైన మానసిక సంఘర్షణ, భావోద్వేగాలున్న సినిమాగా చెప్పడం మేలు. గడ్డాలు, మీసాలు, రేగిన జుట్టుతో కనుచూపుమేర వ్యక్తులు లేని ఖాళీ ప్రదేశంలో రెండుగంటల పాటు సినిమాను చూపించడం మామూలు విషయం కాదు. ఆ అంశంలో చంద్రసిద్ధార్థ సక్సెస్ అయ్యారు. మానసిక సంఘర్షణను తెరపై చక్కగా ఆవిష్కరించారు. పది నిమిషాలకు ఓ సారి చమక్కుమనిపించే అంశాలను ప్రోది చేశారు. పాటలు, దానికి తగ్గ బాణీలు, వాటిలో సాహిత్యం బావున్నాయి.
తాత్వికత ఉన్న పాటలను ఇందులో వినవచ్చు. టైటిల్‌ని జస్టిఫికేషన్ చేసే విధంగా అంతా శివలీల అన్నట్టు వ్యక్తుల మధ్య కలయికను చూపించారు. మంచి మాటలు నాలుగు చెబితే బండరాయి కూడా కరుగుతుందనే విషయాన్ని మరోసారి బాబ్జీ పాత్ర ద్వారా రుజువు చేశారు. ఎదుటివ్యక్తిలో తప్పు లేదని తెలిసినప్పుడు అతని బాగోగులకై ఎంత దూరమైనా ప్రయత్నించే వ్యక్తిగా జంగయ్య పాత్ర ఉదారంగా సాగుతుంది. ప్రేమించే ధైర్యం చేసిన ఆది, పెద్దలను ఎదిరించే ధైర్యం చేయలేకపోవడం వాస్తవ పరిస్థితే. హైపర్ ఆది పాత్ర సినిమాలో రిలీఫ్. మొత్తానికి చంద్రసిద్ధార్థ మార్క్ సినిమాలను చూడాలనుకునేవారికి నచ్చుతుంది. కాసింత తత్వం, జీవితం, వేదన, అనుభూతి వంటివి కావాలనుకునేవారికి కూడా సినిమా నచ్చుతుంది. రెగ్యులర్ కమర్షియల్ అంశలు ఏవీ లేవు. రొటీన్ సినిమాలకు విభిన్నంగా సాగుతుంది.