రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో అన్నింట్లో ఒకటే రాజకీయ పరిస్థితులు ఉండవు. కొన్నిచోట్ల పార్టీ, కొన్ని చోట్ల అభ్యర్థిని బట్టి, మరికొన్ని చోట్ల ఇతర పరిస్థితులపై రాజకీయ సమీకరణాలు ఆధారపడి ఉంటాయి. అంతేగాక కొన్ని నియోజకవర్గాల్లో స్థానికులు, మరోచోట ఒకసారి ఒకపార్టీ.. మరోసారి మరోపార్టీ, ఇంకోచోట స్థానికేతరులే విజయం సాధిస్తూ ఉంటారు. ఇప్పుడు విశాఖలోని పాయకరావుపేట నియోజకవర్గానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారంతా ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేసినవారే కావడం విశేషం! అంతేగాక తమ సర్వీసును వదులుకుని మరీ రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మన్ననలు అందుకున్నారు. ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన ఆ ముగ్గురు మాజీ ఉద్యోగుల గురించి ఒక్కసారి తెలుసుకుందాం!పరిస్థితుల ప్రభావమో లేక ప్రజాసేవ చేయాలనే తపనో.. కారణమేదైనా రాజకీయాల్లోకి అడుగు పెట్టి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. తొలిసారి ఎన్నికల్లోనే ఎమ్మెల్యేలుగా గెలుపొంది రికార్డు సృష్టించారు. వారిలో మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు ఒకరు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, హాస్టల్ వార్డెన్‌గా పనిచేశారు. విజయనగరం జిల్లాలో వార్డెన్‌గా పనిచేస్తున్నప్పుడు బదిలీ కోసం కాకర.. ఒక ఎమ్మెల్యే వద్దకు వెళ్లారు. బదిలీ చేయడం కుదరదని చెప్పడంతో, ఆ కసితో తానే ఎమ్మెల్యే కావాలని నిశ్చయించుకున్నారు. వార్డెన్‌గా పనిచేస్తున్న సమయంలో 1985లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ సమయంలో పాయకరావుపేట నియోజకవర్గం టీడీపీ టికెట్‌కు దరఖాస్తు చేశారు. ఈ టిక్కెట్ కోసం చాలా మంది పోటీ పడ్డారు. ఎస్.రాయవరం చినగుమ్ములూరుకు చెందిన స్థానికుడైన కాకర నూకరాజుకు ఎన్టీఆర్ పార్టీ టిక్కెట్ ఇచ్చారు.ఆయన తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తరువాత 1989, 1994లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేటలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చాలా వ్యూహాలు రూపొందించారు. పంచాయతీరాజ్‌శాఖలో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారిగా పనిచేస్తున్న గొల్ల బాబూరావుకు చివరికి టికెట్ ఇచ్చారు. అంతకుముందు విశాఖ జిల్లాలో గొల్ల బాబూరావు సెట్విన్ అధికారిగా, జడ్పీ సీఈవోగా పనిచేశారు. ఆయన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని కొవ్వలి గ్రామానికి చెందిన వారు. 2009 లో ఆయన టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టి 656 ఓట్ల తేడాతో ఎమ్మె ల్యేగా గెలుపొందారు. 2011లో పదవికి రాజీనామా చేయడంతో పాయకరావుపేటకు ఉప ఎన్నిక వచ్చింది. అందులో వైసీపీ నుంచి పోటీ చేసి రెండోసారి కూడా బాబూరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.ఇక గత ఎన్నికలకు ముందు ఆయన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంకు మారి అక్కడ పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వంగలపూడి అనిత ఎన్నికల ముందు వరకూ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. 2013లో టీడీపీ క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించి.. నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి 2014లో పోటీ చేశారు. తొలిసారి ఆమె 2,828 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పటివరకూ ముగ్గురు ఉద్యోగులు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందడం విశేషం. కాకర మూడుసార్లు, గొల్ల బాబూరావు రెండు సార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఎమ్మెల్యే అనిత తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు