- కాంగ్రెస్ ది వెన్నుపోటు…
- బిజెపిది ఎదురుపోటు..
- మరి చంద్రబాబుది ఏ పోటు?
రాజధాని మొదలుకుని పోలవరం..ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ప్రత్యేక ప్యాకేజీ వంటి విషయాల్లో కేంద్రంలో..రాష్ట్రంలో భాగస్వామ్య పక్షంగా ఉన్న బిజెపి ఏ మాత్రం సానుకూలంగా స్పందించకపోయినా ..మీరు చేస్తుంది తప్పు అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా గట్టిగా చెప్పలేకపోతున్నారు?. కేంద్ర ప్రభుత్వం ఈ ఒక్క విషయంలో ఏపీ ప్రభుత్వానికి పూర్తి న్యాయం చేసింది అని చెప్పగలిగే అంశం ఒక్కటైనా ఉందా?. ఉంటే టీడీపీ నేతలు చెప్పగలరా?. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అరుణ్ జైట్లీ గురువారం నాడు లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. అంతే కాదు..ఆదివారం నాడు ఎంపీలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు కూడా?.
ఎవరైనా ఈ విషయం గురించి మాట్లాడితే కేంద్రం నుంచి బయటికి వస్తే సమస్యలు తీరిపోతాయా? అంటారు?. మరి లోపల ఉన్నా ఏ మాత్రం మేలు కూడా జరగటం లేదు కదా?. తెలుగుదేశం నేతలు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు?. బిజెపి నేతలు ఏపీ మంత్రివర్గంలో ఉన్నారు?. ఒక్కటంటే ఒక్క అంశంలోనూ కేంద్రం ఏపీకి న్యాయం చేయటంలేదని భావించినప్పుడు ఈ నాలుగేళ్లలో ఒక్కసారి అయినా నిలదీయక్కర్లేదు…కనీసం ఎందుకు ప్రశ్నించటం లేదు? అన్నది ఎవరికీ అర్థం కాని విషయం. ఒకప్పుడు కేంద్రలో చక్రం తిప్పిన చంద్రబాబు విభజన తర్వాత ఎంతో నష్టపోయిన ఏపీ కోసం ఎందుకు గట్టిగా పోరాడలేకపోతున్నారు?. టీడీపీ నేతలు చెబుతున్నట్లు కాంగ్రెస్, బిజెపి చేస్తున్న మోసమే మరి టీడీపీకి కూడా ఏపీకి చేస్తున్నట్లు కాదా?.
సఖ్యతతో సాధిస్తామని ప్రకటించిన చంద్రబాబు ఎందుకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటాలను తెచ్చుకోవటంలో కూడా విఫలమవుతున్నారు. ఇవి ఏపీ ప్రజల మనసుల్లో మెదులుతున్న సందేహాలు. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం కూడా లేదు. చంద్రబాబు ఇప్పటికైనా కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించగలరా?. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఓ దశలో కేంద్రం మిథ్య అని ప్రకటించారు. చంద్రబాబు మాత్రం కేంద్రంపై ఎందుకో నోరెత్తే సాహసం కూడా చేయలేకపోతున్నారు?. కారణాలను కాలమే తేల్చొచ్చు. కేంద్ర బడ్జెట్ తర్వాత టీడీపీ క్యాంప్ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం మొదలుపెట్టింది.