ఏపీ తరపున ఒన్ అండ్ ఓన్లీగా పార్లమెంట్ లో ఎంపీ గల్లాజయదేవ్ రాష్ట్ర ప్రజల వాణి వినిపించారు. ఇటీవలి ఓ సూపర్ హిట్ మూవీలోని డైలాగ్ ను గుర్తు చేస్తూ.. నవ్యాంధ్రకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందే అని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆవేదనతో సాగిన ఆయన ప్రసంగానికి ఆటంకాలూ ఎదురయ్యాయి. అయితే.. రాష్ట్ర వాసుల భావోద్వేగాన్ని.. అసంతృప్తిని కళ్లకు కట్టారు.పదీ..ఇరవై కాదు.. 58 నిమిషాల 22 సెకన్లు. పార్లమెంట్ సాక్షిగా నవ్యాంధ్ర పరిస్థితిని, రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టినట్లు వివరించా ఎంపీ గల్లా జయదేవ్. విభజన సమయంలో పార్లమెంట్ లో అప్పటి ప్రభుత్వం, ప్రధాని ఇచ్చిన హామీలను, ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ చేసిన డిమాండ్లను గుర్తుచేశారు. విభజన పాపంలో కమలదళానికీ వాటా ఉందని రాష్ట్రాభివృద్ధికి చేయూతనివ్వాల్సిందే అని స్పష్టంచేశారు. అంతేనా.. భరత్ అనే నేను సినిమాలోని ఆణిముత్యంలాంటి డైలాగ్ ప్రస్తావించారు. ఇచ్చిన ప్రమాణాన్ని నిలుపుకోవాలని, అలా నిలుపుకోక పోతే మనిషే కాదని ఆ చిత్రంలోని డైలాగ్‌ను ఆంగ్లంలో అనువదించి వినిపించారు. మోదీ, అమిత్ షా ఇచ్చిన హామీలను మర్చిపోయారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విసిగిపోయారని, ఇచ్చిన ప్రమాణాలను కేంద్రం నిలుపుకోలేదని గల్లా స్పష్టంచేశారు. ఆయన ప్రసంగం ప్రతిపక్షాన్ని కదిలించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అయితే.. గల్లా ప్రసంగానికి కదిలిపోయారు. 21వ శతాబ్దంలో రాజకీయ ఆయుధానికి ఆంధ్రులు బలయ్యారని అన్నారు. ఇచ్చిన హామీలను నిలుపుకోలోలేని కేంద్రంపై ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నన్నారని విరుచుకుపడ్డారు. అందుకే తమ రాష్ట్రంలో ధర్మపోరాటానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తోందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండాల్సిన పారదర్శక సంబంధాలను మోదీ తీవ్రంగా దెబ్బతీశారని జయదేవ్ ఆరోపించారు. పారదర్శకత, నమ్మకం, ప్రాధాన్యత, మాట నిలబెట్టుకోవడం అన్న అంశాలను కేంద్రం విస్మరించించిందని.. తమకు నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విశ్వాసం పోయిందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన పారదర్శకంగా జరగలేదని, న్యాయం చేసే విషయంలో ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకున్నారని, నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వలేదని గల్లా జయదేవ్ దుయ్యబట్టారు. పలు విభజన హామీలపై ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కేంద్రం విఫలమైందని చెప్పారు. తాను 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల తరఫున మాట్లాడుతున్నానని అన్నారు. పార్లమెంట్ తలుపులు మూసేసి, అప్రజాస్వామ్యంగా రాష్ట్రాన్ని విభజించారని గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. ఆ సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు జయదేవ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. విభజన వల్ల తెలంగాణకు ఆస్తులు, ఆంధ్రప్రదేశ్ కు అప్పులు మిగిలాయంటూ గల్లా జయదేవ్ పార్లమెంట్ కు వివరించారు. రాష్ట్ర పరిస్థితిని, కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆయన వివరిస్తున్న సమయంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ తీవ్ర అసహనానికి గురయ్యారు. గల్లాకు ఇచ్చిన సమయాన్ని గుర్తుచేసి త్వరగా ముగించాలని అన్నారు. అయితే.. ఆయన ఒప్పుకోలేదు. అవిశ్వాస సమయంలో ప్రసంగించిన ఎంపీల రికార్డులు పరిశీలించుకోండి అంటూ.. ప్రజల వాణి వినిపించారు. స్పీకర్ ఆర్డర్ కు గల్లా దీటుగా స్పందించారు. సమయం విషయంలోనూ.. తమను నిర్లక్ష్యం చేయొద్దని వ్యాఖ్యానించారు. గల్లా ప్రసంగం తర్వాత బీజేపీ ఎంపీ రాకేష్ సింగ్ వంతు వచ్చింది. ఆయన గల్లా కంటే.. ఎక్కువ టైమే మాట్లాడారు. కానీ.. ప్రసంగాన్ని త్వరగా ముగించేయాలన్న హుకుం.. ఆయనకు ఇవ్వలేదు స్పీకర్ మేడమ్. విభజన సమయంలో రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ ఇచ్చిన ఆరు హామీలను గల్లా జయదేవ్ గుర్తు చేశారు. ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారని అన్నారు. పారిశ్రామిక రాయితీలు, పోలవరం ముంపు మండలాల విలీనం, రెవెన్యూలోటు పూడుస్తామని హామీలు ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 2014లో తెలుగుతల్లిని నిలువునా చీల్చిందని, కాంగ్రెస్ తల్లిని చంపి బిడ్డను ఇచ్చిందని ఆనాడు మోడీ అన్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తావించారు. తిరుపతి వెంకన్న సాక్షిగా మోడీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని స్పష్టంచేశారు. ఏపీ పట్ల కేంద్రం వివక్ష చూస్తుంటే మేం భారతదేశంలో భాగం కాదా? అనే భావన కలుగుతోందని గల్లా జయదేవ్ ఆవేదన వ్యక్తంచేశారు. అన్యాయంగా గొంతు నొక్కి విభజన బిల్లు పాస్ చేశారని ఏపీకి అన్యాయం జరిగిందని వాపోయారు. ఇప్పుడైనా న్యాయం చేయండి అంటూ కేంద్రాన్ని కోరారు. మొత్తంగా గల్లా జయదేవ్ ప్రసంగం రాష్ట్ర ప్రజల వాణికి అద్దంపట్టింది. నవ్యాంధ్రపై కేంద్రం నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది.