ఆ ఇద్దరు పోటీ చేసేది ఎక్కడి నుంచి? ఎవరు ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారు? కొడుకు ప్రత్యక్ష రాజకీయాల్లో వేసే తొలి అడుగు భారీగా ఉండాలని తండ్రి ఆరాటపడుతున్నారు. ఇన్నాళ్లూ తండ్రి చాటు బిడ్డగా ఉండి.. భావి రాజకీయ నేత అనిపించుకునేందుకు కొడుకు తహతహలాడుతున్నాడు. నూతన రాజధాని గుంటూరులో పట్టుకోసం రాజధాని ప్రాంత జిల్లాల్లో తిరుగులేని మెజార్టీతో గెలవాలంటే తాను మంగళగిరి నుంచి పోటీకి దిగితే ఎలా ఉంటుందనే అంశంపైనా చంద్రబాబు చర్చలు జరుపుతున్నారట. తాను ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఈ ప్రాంతం త్వరగా అభివృద్ధి చెందుతున్న భావనతో ఉన్నారట. మొత్తం మీద ఎన్నికలకు మరో పది నెలలు మాత్రమే సమయం ఉండటంతో పాటు ముందస్తు రాగం వినిపిస్తున్న తరుణంలో.. వీరు పోటీ చేసే నియోజకవర్గాలపై ఒక క్లారిటీ వస్తే బాగుంటుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే లోకేష్‌కు సరైన నియోజకవర్గం ఎంచుకునే విషయంలో అటు చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ మాత్రం కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారన్నది మాత్రం స్పష్టంగానే తెలుస్తోంది.ఈ ఇద్దరినీ చూస్తున్న నేతలు మరింత కంగారు పడుతున్నారు. ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న పరిణామాలు ఎవరికీ అంతుచిక్కడం లేదు. వచ్చే ఎన్నికలు టీడీపీకి ఎంత కీలకమో.. ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్‌కు అంతకంటే కీలకం కానున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టి ఆయన ఎక్కడి నుంచి పోటీచేస్తారనే అంశంపైనే పడింది. చాలా నియోజకవర్గాల పేర్లు వినిపిస్తున్నా.. ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. మరో పక్క ఆయనతో పాటు చంద్రబాబు పోటీపైనా క్లారిటీ లేదనే చర్చ మొదలైంది.ప్రస్తుతం రాజకీయ నాయకులంతా తమ నియోజకవర్గాలపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా ఏ నియోజకవర్గం నుంచి పోటీచేస్తామో తెలియని నేతలు.. పెద్దలపై ఒత్తిడి తెస్తూ టికెట్ తమకే వచ్చేలా శ్రమిస్తున్నారు. నేతలే ఇంతలా ఆలోచిస్తుంటే.. ఇక పార్టీ అధినేత తనయుడి అరంగేట్రం గురించి ఇంకెంత ఆలోచించాలో కదా! ప్రస్తుతం టీడీపీలో నంబర్.2 అయినా లోకేష్.. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయడం ఖాయమని తేలిపోయింది. ఇప్పటికే లోకేష్‌ను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు పెరిగిపోయాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ లోకేష్ ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తాను చాటుకోవాల్సిన అవసరం ఉంది. పోటీ చేయడం డిసైడ్ అయినా పోటీ ఎక్కడి నుంచి అనే విషయంపై పార్టీలో తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. మంగళగిరి, కుప్పం, ఇలా పార్టీకి సేఫ్ జోన్‌గా ఉండే నియోజకవర్గాలను నాయకులు జల్లెడ పడుతున్నారు. ఎన్నో నెలల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతున్నా.. ఇంకా ఒక స్పష్టత రావడం లేదు.తనయుడితో పాటు తండ్రి చంద్రబాబు పోటీపైనా ఆసక్తికరమైన చర్చే జరుగుతోంది. ఆయన ఎన్నో ఏళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని లోకేష్ కోసం వదులుకుంటారని చిత్తూరు జిల్లా నాయకులు అభిప్రాయపడుతున్నారు. కుప్పం నుంచి లోకేష్ పోటీ చేయడం ఖాయమని, ఆయన ఆ నియోజకవర్గంపై గత కొన్నాళ్లుగా ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారని చెబుతున్నారు. నియోజకవర్గంలోని పలువురు నాయకులతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. తన తండ్రి సుదీర్ఘకాలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న స్థానం నుంచి పోటీ చేస్తే తనకూ ప్రజలు పట్టం కడతారని లోకేష్ భావిస్తున్నారట. ఇక్కడయితే ఎటువంటి రిస్క్ ఉండదని నాయకులు సష్టం చేస్తున్నారు.