మరో పదిమాసాల్లో ఎన్నికలు ఉన్నాయి. 2014లో జరిగిన ఎన్నికలకు రాబోయే ఎన్నికలకు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఏపీలో కేవలం బలమైన పోటీ కేవలం వైసీపీ, టీడీపీ-బీజేపీల మధ్యే సాగింది. అయితే, వచ్చే ఎన్నికలు మాత్రం ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం.. ఏ పార్టీకి ఆ పార్టీ రంగంలోకి దిగుతున్నాయి. ముఖ్యంగా తొలిసారి ఎన్నికల కురుక్షేత్రంలోకి పవన్ వంటి బలమైన యూత్ ఫాలోయింగ్ ఉన్న హీరో రంగంలోకి దిగుతున్నారు. ఇక, గత ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన జాతీయ పార్టీ కాంగ్రెస్.. వచ్చే ఎన్నికల్లో పుంజుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డేందుకు రెడీ అయింది. ఇక, కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఏపీలో తిష్ఠ వేయాలని డిసైడ్ అయింది. అయితే, ఇది సాధ్యమా కాదా అనేది తెలియకపోయినా.. ఎన్నికలను ప్రభావితం చేసేలా ముఖ్యంగా కుల రాజకీయాలను ప్రభావితం చేసేలా చక్రం తిప్పుతోంది. వచ్చే ఎన్నికలు చాలా ఇంట్రస్టింగ్‌గా మారనున్నాయి. ఇక, అధికార పార్టీ అధినేత చంద్రబాబు ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఆయన తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ప్రజలను తనవైపు తిప్పుకొనేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను భారీ ఎత్తున అమలు చేస్తున్నారు. అందరికీ అన్నీ.. అనే విధంగా ఆయన ఇప్పటికే పలు పథకాలు ప్రారంభించారు. ఇక, కులాల వారీగా కూడా ఆయన పలు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి.. వాటి ద్వారా లబ్ధి చేకూరుస్తు న్నారు. సామాజిక పింఛన్లను అందరికీ అందిస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరినీ ఆయన తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వీటికి తోడు భారీ ఎత్తున ప్రచారం చేయించేందుకు ఇప్పటికే ప్రచార రథాలను సిద్ధం చేసుకున్నారు. వచ్చే ఆరు మాసాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ప్రతి నేతా నియోజకవర్గాల్లో ఉండేలా పక్కా వ్యూహం సిద్ధం చేసుకున్నారు చంద్రబాబు.ఇక, వైసీపీ విషయానికి వస్తే.. జగన్ ప్రస్తుతం చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర సెప్టెంబరు 2 నాటికి పూర్తి చేసేలా ఆయన ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నారు. అనంతరం ఎన్నికలకు మూడు మాసాల ముందు.. రాష్ట్ర మంతటా బస్సు యాత్ర చేయాలని పాదయాత్రలో కలవని వారిని బస్సు యాత్రలో కలిసి పార్టీని పుంజుకునేలా చేయాలని జగన్ ప్లాన్ చేసుకున్నారు. ఇదే సమయంలో గెలుపు గుర్రాలకు టికెట్లు ఖరారు చేయాలని నిర్ణయించుకున్నట్టు లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక, జనసేన విషయానికి వస్తే.. ప్రస్తుతం ఉత్తరాంధ్రను టార్గెట్ చేసుకున్న పవన్.. త్వరలోనే రాయల సీమలో ప్రచారం ప్రారంభించనున్నారు. అదేసమయంలో పార్టీలో జవసత్వాలు నింపేలా కార్యకర్తలను, నాయకులను ఆయన చేర్చుకునేందుకు రెడీ అవుతున్నారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లోనూ పోటీకి రెడీ అవుతున్నట్టు పవన్ ఇప్పటికే ప్రకటించారు. పవన్ ప్రభావం ఎంత వరకు ఉంటుందన్నదానిపై ఇప్పటికే రాజకీయ చర్చలు స్టార్ట్ అయ్యాయి. కాంగ్రెస్ ఇప్పటికే ఇంటింటి ప్రచారం ప్రారంభించింది. పాత కాపులకు పెద్దపీట వేసేందుకు రెడీ అయింది. అధికారంలోకి వస్తే.. ప్రత్యేక హోదా తామే ఇస్తామని చెబుతోంది. ఇక, బీజేపీ కూడా ఇదే తరహా రాజకీయాలకు తెరదీసింది. ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన పెట్టినా.. రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి చెందిందంటే.. అది మోడీ చలవేనని, బీజేపీకి ఓట్లు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేతలు చెబుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే కమ్మ, కాపు, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఆయా పార్టీలు ప్రత్యేకంగా డీల్ చేయాలని భావించాయి. వచ్చే ఎన్నికల్లో మైనార్టీల ఓట్లను తనవైపు తిప్పుకొనేందుకు చంద్రబాబు వ్యూహాత్మక అడుగులు మరింత పెరగనున్నాయి. ఇక, ఎస్సీ, ఎస్టీల ఓట్లు కూడా తమకే పడేలా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించనున్నారు. జనసేనాని కాపులపై పెద్దగానే దృష్టి పెట్టారు. పైకి కుల రాజకీయాలకు వ్యతిరేకమని చెప్పినా.. ఆయన కాపు నేతలకు పెద్ద పీట వేసే ఛాన్స్ కనిపిస్తోంది. కమ్మలు టీడీపీకి, రెడ్లు వైసీపీకి ఉంటారని చెప్పినా…. రాజధాని జిల్లాల్లో జగన్ కూడా కమ్మలను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే సీఎం చంద్రబాబుకు, తొలిసారి సీఎం పీఠం కోసం చావోరేవోకు రెడీ అవుతోన్న జగన్ మధ్య ఆసక్తికర పోరాటం…. ఇలా ప్రతి పార్టీ తమదైన శైలిలో దూసుకుపోతుండడం వచ్చే ఎన్నికలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తుండడంతో పాటు జాతీయ రాజకీయాలను సైతం ఆకర్షిస్తున్నాయి.