జనసేనలో చేరికలు జోరందుకున్నాయి. ఇప్పటికే చాలామంది సీనియర్ నాయకులు ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతుండగా.. మరికొందరు ఎప్పుడెప్పుడు ఆ పార్టీలోకి వెళ్లిపోదామా అనే ఆలోచనలో ఉన్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న తరుణంలో టీడీపీలో అలజడి మొదలవుతోంది. ముఖ్యంగా ఆ పార్టీ బలంగా ఉన్న గోదావరి జిల్లాల్లోని రాజకీయ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకపక్క వైసీపీకి బలం క్రమక్రమంగా పెరుగుతోందనే ప్రచారానికి తోడు.. పవన్ ప్రభావం కూడా ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. దీంతో జిల్లా రాజకీయాలు హీటెక్కుతున్నాయి. టికెట్ దక్కదని ముందే ఊహించిన నేతలు ప్రస్తుతం ఆయా పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.టీడీపీ, వైసీపీలోకి వెళ్లలేక సతమతమవుతున్న వారికి జనసేన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఇన్నాళ్లూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అని వేచి చూశారు. పోరాట యాత్రలో భాగంగా పవన్ సమక్షంలోనే కొందరు పార్టీలో చేరుతుండటంతో.. వీరిలోనూ ధైర్యం పెరిగింది. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి ఏళ్ల పాటు సేవలందించి, వివిధ హోదాల్లో పనిచేసిన సీనియర్ నాయకుడు యర్ర నారాయణస్వామి వారసుడు టీడీపీకి గుడ్‌బై చెప్పేశారు. ఆయన తనయుడు, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నవీన్ జనసేనలో చేరబోతున్నట్లు ప్రకటించారు.ప్రస్తుతం యర్ర నారాయణస్వామి తనయుడు నవీన్ జనసేనలోకి వెళుతున్నట్లు ప్రకటించారు. యర్రా నారాయణస్వామి సుదీర్ఘంగా జిల్లా పార్టీ రాజకీయాల్లో చాలా బలమైన నేత. అంతేగాక జెడ్పీ చైర్మన్‌గా పనిచేశారు. తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేశారు. తర్వాత మంత్రిగానూ ఆయన బాధ్యతలు స్వీకరించారు.నారాయణస్వామి అన్నయ్య కుమార్తె తోట సీతారామలక్ష్మి ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా, జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె కుమారుడికి భీమవరం టికెట్ ఇప్పించుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుండటంతో ఈసారి తాడేపల్లిగూడెం టికెట్‌ను నారాయణస్వామి తనయుడు నవీన్ ఆశిస్తున్నారు. కానీ చంద్రబాబు యర్రా ఫ్యామిలీకి రెండు సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిగూడెం సీటు ఆశిస్తోన్న నవీన్‌కు టికెట్ ఇవ్వడం కష్టమేనని తేలిపోవడంతో.. ఆయన పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. జనసేనలో చేరి తాడేపల్లిగూడెం నుంచి పోటీచేయబోతున్నారని తెలుస్తోంది. తాడేపల్లిగూడెంలో ఆయన భవిష్యత్ రాజకీయాలు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ నుంచి వైదొలగేందుకు గల కారణాలను వివరించారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆ పార్టీ నెరవేర్చలేకపోయిందని, కాపులకు రిజర్వేషన్ హామీని నెరవేర్చలేకపోవడం అందులో భాగమేనన్నారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటులో జాప్యం కారణంగా కేవలం 3208 కోట్లు మాత్రమే రుణాల రూపేణా ఇవ్వగలిగారని తెలిపారు. అవినీతి లేని రాజకీయాలు చేయాలన్న ఉద్దేశంతోనే జనసేన పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. ఇటీవల తమ సొంతూరులో సమీక్ష నిర్వహించినప్పుడు వైఎస్సార్, జనసేన నుంచి నాయకులు వచ్చి కలిశారని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనను ఆహ్వానించడంతో ఆ పార్టీలో చేరుతున్నట్టు వెల్లడించారు. తాడేపల్లిగూడెం కేంద్రంగానే రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తామని తెలిపారు. మరి ఇది టీడీపీకి ఎదురుదెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నవీన్ తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థిగా దాదాపు ఖరారైనట్టే అంటున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ జిల్లాలో గెలుచుకున్న ఏకైక సీటు గూడెం. ఆ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడి హోదాలో చిరంజీవి స్వయంగా ఓడినా గూడెంలో మాత్రం ప్రజారాజ్యం గెలిచింది. ఇప్పుడు నవీన్ టీడీపీ టిక్కెట్ ఆశించినా…. ఇక్కడ టీడీపీలో ఇప్పటికే ముగ్గురు బలమైన అభ్యర్థులు పోటీపడడంతో సీటు కోసమే చివరకు ఆయన జనసేన జెండా కిందకు చేరిపోయారు.