ఆగష్టు 15 నుంచి బీజేపీ హఠావో, దేశ్ బచావో నినాదాన్ని ప్రచారం చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. షహీద్ దివస్ సందర్భంగా.. శనివారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన మమతా ఈ వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీ గట్టి దెబ్బ తగులుతుందని జోస్యం చెప్పిన మమత.. ఆ పార్టీ 150 సీట్లకు మించి గెలుపొందలేదన్నారు. బెంగాల్లో బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్, సీపీఐ సాయం అక్కర్లేదని తేల్చి చెప్పిన మమత.. ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 స్థానాల్లో తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ (ఎం)తో రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తాం. బీజేపీని తరిమికొట్టి దేశాన్ని గెలిచేందుకు ప్రతిన బూనుదాం’ అని మమత ఉద్వేగంగా ప్రసంగించారు. దేశమంతటా మూకుమ్మడి దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వమే మనలో కొందర్ని తాలిబన్లగా తయారు చేస్తోంది. బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌లలో నేను గౌరవించే మంచి వ్యక్తులు కొందరు ఉన్నారు. కానీ మిగతా వాళ్లంతా నీచ రాజకీయాలు చేస్తున్నార’ని మమత మండి పడ్డారు.
1993 జూలై 21న నాటి లెఫ్ట్ సర్కారు జరిపిన కాల్పుల్లో 13 మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. అప్పటికీ మమత కాంగ్రెస్‌లోనే ఉన్నారు. నాటి నుంచి ఏటా జూలై 21న షహీద్ దివస్ (అమరుల దినోత్సవం) నిర్వహిస్తున్నారు.