లోక్‌సభలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయాక.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగు దేశం పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గజిని సినిమాలో హీరోలా టీడీపీ కన్వినియెంట్ మెమొరీ లాస్ సిండ్రోమ్‌తో బాధపడుతోందంటూ జనసేనాని ఎద్దేవా చేశారు. జనసేన అనుకూల రాజకీయాలు చేయదు, ఏదో సరైందో అదే చేస్తుందని పవన్ ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్‌ను బలహీన పరిచిందెవరు? బీజేపీతో కుమ్మక్కయిందెవరు? టీడీపీ ఓసారి వెనక్కి తిరిగి చూసుకొని మాట్లాడాలి. రేపటి రోజున మీ సౌలభ్యాన్ని బట్టి మీరు మళ్లీ మాట మార్చరని హామీ ఇవ్వగలరా? అంటూ జనసేనాని తెలుగుదేశం పార్టీని ప్రశ్నించారు. “ఏపీ ముఖ్యమంత్రి మాకు ఇంకా మంచి మిత్రుడే’’ అని రాజ్‌నాథ్ సింగ్ అంటున్నారు. దీన్ని బట్టి టీడీపీ-బీజేపీ ఇంకా కలిసి ఉన్నాయని స్పష్టమౌతుంది. ఇద్దరు కలిసి ఏపీ ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు అనిపిస్తోందని పవన్ ట్వీట్ చేశారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, ఇప్పుడే పుట్టిన పాలుగారే పసి పిల్లలలాగా.. కేంద్రం చేత మోసగింపబడ్డాం.. అంటే, ప్రజలు నమ్ముతారని టీడీపీ నాయకులు ఎలా అనుకుంటారని జనసేనాని ప్రశ్నించారు. బీజేపీకి నష్టం కలగకూడదని జనసేన ట్వీట్లు చేస్తోందన్న సీఎం వ్యాఖ్యలపై పవన్ మండిపడ్డారు. ‘‘ఏపీలో ఒక్క సీటు కూడా గెలవలేని బీజేపీని వెనకేసుకు రావడం వల్ల మాకు వచ్చే లాభమేంటి? ఏపీ ప్రజలు బీజేపీని పూర్తిగా వదిలేశారు. ఆ పార్టీతో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా? బీజేపీతో సమానంగా టీడీపీ కూడా అంతే దారుణంగా ఏపీ ప్రయోజనాలను దెబ్బ తీసిందనేదే నా ట్వీట్ల వెనుక ముఖ్య ఉద్దేశం’’ అని పవన్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ చాలంటూ గతంలో టీడీపీ చేసిన ప్రకటనలను జనసేన తేదీల వారీగా బయటపెట్టింది. హోదా సంజీవని కాదన్న చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారంటూ జనసేన మండిపడింది. ప్యాకేజీ ఇచ్చినందుకు మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో ప్రకటన కూడా చేశారు. హోదా కోసం రోడ్ల మీదకు వచ్చిన వారిని బెదిరించారు, అరెస్ట్ చేయించారని జనసేన గుర్తు చేసింది