- మళ్లీ జగన్-మోదీ భేటీ..
- మిత్ర పక్షాల మధ్య చిచ్చుకు కారణమైంది.
ప్రధాని మోదీ-వైఎస్సార్ సీపీ అధినేత జగన్ భేటీ ఏపీ రాజకీయాల్లో సమగ్ర మార్పులు తీసుకొచ్చింది. మిత్ర పక్షాల మధ్య చిచ్చుకు కారణమైంది. కత్తులు దూసుకునేందుకు బీజం వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అపాయింట్ మెంట్ దొరకడం గగనంలా మారిన సమయంలో.. ప్రతిపక్ష నేతకు మోదీ షేక్ హ్యాండ్ ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో దుమారమే రేపింది. దీని తర్వాత బీజేపీ-టీడీపీ మధ్య కత్తులు దూసుకునే పరిస్థితి. అయితే ఇప్పుడు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమే జరగబోతోంది. మరోసారి మోదీ-జగన్ భేటీ అయ్యేందుకు నేతలు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వైసీపీ-బీజేపీ పొత్తు చిగురించేందుకు నేతలు ఉవ్విళ్లూరుతున్న సమయాన.. వీరి భేటీ వార్త పెను తుఫాను సృష్టించే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏపీలో రాజకీయాలు రాకెట్ కంటే వేగంగా మారిపోతున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయనే సంకేతాలు వినిపిస్తున్న తరుణంలో.. పొత్తుల కోసం రాజకీయ పార్టీలు కొత్త ఎత్తులు వేస్తున్నాయి. టీడీపీ-బీజేపీ మైత్రిపై అనేక రకాల సందేహాలు ఉన్నాయి. ఇదే సమయంలో హోదా ప్రకటిస్తే బీజేపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని వైసీపీ అధినేత జగన్ ప్రకటించడంతో రాజకీయ సమీకరణాలకు బీజం పడింది. ఇదే సమయంలో వైసీపీ-బీజేపీ మైత్రిని మరింత బలపరిచేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయన సమక్షంలోనే మరోసారి మోదీ-జగన్ భేటీ కాబోతున్నారని తెలుస్తోంది. ఇందులో బీజేపీ ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచబోతున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం జగన్ నెల్లూరు జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర నిర్వహిస్తున్నారు. పాదయాత్ర పూర్తయిన తర్వాత ఆయన మోడీతో భేటీ అవుతారని తెలుస్తోంది. తెరవెనుక స్నేహాన్ని నడుపుతున్న మోడీ, జగన్ రాబోయే కాలంలో బహిరంగంగానే దాన్ని కొనసాగించ బోతున్నారని ఢిల్లీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అధికార తెలుగుదేశంపై రాష్ట్ర ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉందని, వారితో వెళితే బీజేపీకి నష్టమనే ప్రచారం అధికమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలు కూడా వైసీపీ వైపు సానుకూలంగా ఉన్నారని వారి మాటలను బట్టే తెలుస్తోంది. ప్రధానంగా మోడీ- జగన్ భేటీలో.. అసెంబ్లీ సీట్ల సర్దుబాబు వంటి అంశాలు చర్చిస్తారని తెలుస్తోంది.
ఒకవేళ బీజేపీతో కలిస్తే.. ఆ పార్టీకి సుమారు 30 అసెంబ్లీ సీట్లతో పాటు 6-8 ఎంపీ సీట్లు ఇవ్వవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తుంటే దాని ఖ్యాతి చంద్రబాబుకు పోతోందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. తాజాగా..వైసీపీ నేతలు కూడా ఇటువంటి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఒకటి రెండుసార్లు బీజేపీ నేతలు కూడా ఆలోచించాలని భావిస్తున్నారట. టీడీపీతో బంధం తెంచుకుని వైసీపీతో కలవడానికి బీజేపీ పెద్దలు ఈ అంశాలను తీసుకొస్తున్నారట. మొత్తానికి బీజేపీ-వైసీపీ బంధం మరింత బలోపేతమవుతుందనేది దీనిని బట్టి అర్థమవుతోంది. మరి జగన్ ఆఫర్‌కు మోదీ ఎలా స్పందిస్తారో!!