దినదినగండం..నూరేళ్ల ఆయుష్.. అనే నానుడి.. గోదావరి లంక గ్రామాలకు అతికినట్టు సరిపోతుంది. టైమ్ బాగుంటే.. ఒకే. లేకుంటే మాత్రం.. పడవ ప్రమాదాలు జనాలను కాటేస్తుంటాయి. పదుల సంఖ్యలో ప్రాణాలను జలసమాధి చేస్తుంటాయి. అందుకే ప్రభుత్వం సత్వరమే స్పందించి కన్నీటి సంద్రంతో కాలం వెళ్లదీస్తున్న లంక గ్రామాల్లోని రవాణా సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని అంతా కోరుతున్నారు. ప్రమాదం అంచున ప్రయాణాలు.. లంక గ్రామాల్లో ఓ సాధారణ అంశం. ఈ గ్రామాల నుంచి బయటకు రావాలన్నా.. పిల్లలు బడికి వెళ్లాలన్నా.. హాస్పిటల్ కు పోవాలన్నా.. పడవ ప్రయాణమే తప్పనిసరి. ప్రాణాలు అరచేత పట్టుకుని.. పడవ ఎక్కాల్సిందే. లంక గ్రామాల జనాభా 2లక్షలు. వీరిలో సగం మందికిపైగా నిత్యం.. పడవల్లోనే ప్రయాణిస్తుంటారు. వివిధ పనులపై పయనం సాగిస్తూనే ఉంటారు. ప్రయాణం సాగినంత సేపూ.. ప్రాణభయంతో వణికిపోతుంటారు వీరు. పడవ ఎక్కితే.. గమ్యస్థానం చేరేవరకూ.. ప్రాణాలకు గ్యారంటీ లేని దుస్థితే దీనికి కారణం.
లంక గ్రామాలకు వంతెన నిర్మించాలని ప్రతిపాదన ఉంది. అయితే ఇది కార్యరూపం దాల్చడంలేదు. దీంతో ప్రయాణాల కోసం ప్రజలు పడవలపైనే ఆధారపడుతున్నారు. ఇంజన్ బోట్లతో పాటు నాటు పడవలనూ ఆశ్రయిస్తున్నారు. అయితే పడవ నడిపేవాళ్లు మాత్రం భద్రతా ప్రమాణాలు పట్టించుకోవడంలేదు. వారి నిర్లక్ష్యమే ఘోర ప్రమాదాలకు తావిస్తోంది. జులై 14న తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన పడవ ప్రమాదం లంకగ్రామాల్లో విషాదం నింపింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రాన్ని ఆవేదన భరితం చేసింది. ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నా రవాణా సమస్య మాత్రం పరిష్కారం కావడంలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి.. పడవ ప్రమాదాలకు చెక్ పడేలా చర్యలు తీసుకోవాలి. లంకగ్రామాలను ఇతర ప్రాంతాలతో అనుసంధానించేలా వంతెన నిర్మించాలి. లేదంటేలంక గ్రామాల్లో పడవ ప్రమాదాలు కొనసాగుతూనే ఉంటాయి.