భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాలలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి హెలికాప్టర్ లో తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా మేడారం చేరుకుంటారు. వెంకయ్యనాయుడు దేశంలోనే అతి పెద్దదైన ఆదివాసీ జాతర సమ్మక్క-సారలమ్మ జాతరను సందర్శించుకుంటారు. వనదేవతల గద్దెలను సందర్శించి బెల్లం సమర్పించుకుంటారు.
సాయంత్రానికి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ చేరుకుని శంకర నేత్ర చికిత్సాలయంలో ఏర్పాటు చేసిన అదనపు సౌకర్యాలను ప్రారంభిస్తారు. తదుపరి కృష్ణాజిల్లా ఆత్కూరు గ్రామంలో ఏర్పాటు చెయ్యనున్న ప్రాథమిక చికిత్సా కేంద్రానికి మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.
శనివారం ఉదయం గుంటూరు జిల్లా పెదనందిపాడులో కాలేజి ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్వర్ణజయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. తదుపరి ఒమేగా హాస్పిటల్ యొక్క 150 పడకల సూపర్ స్పెషాలిటీ అంకాలజీ సెంటర్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ యొక్క స్వర్ణజయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
ఆదివారం ఉదయం కృష్ణాజిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్ యొక్క రెండవ వార్షికోత్సవంలో పాల్గొంటారు, ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభిస్తారు. అదేరోజు మధ్యాహ్నం ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకుంటారు.
*