YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆకాశంలో ప్రైవేటు బస్సుల టిక్కెట్‌ ధరలు

ఆకాశంలో ప్రైవేటు బస్సుల టిక్కెట్‌ ధరలు

ప్రైవేటు పండగ - ఆర్టీసీ సైతం వసూళ్లు 

విచ్చలవిడిగా పెంచేశారు. 

 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల దోపిడీ మొదలైంది. ఒకవైపు ఆర్టీసీ 50శాతం అదనంగా వసూలు చేస్తుండగా.. ప్రైవేటు బస్సులకు దొరికిందే సందన్నట్టుగా ఎవరికి నచ్చిన ధరను వారు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. అది కూడా సమయాలను బట్టీ ధరలను నిర్ణయించడం గమనార్హం. విజయవాడ, గుంటూరు నుంచి ప్రధానంగా హైదరాబాద్‌, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై నగరాలకు డిమాండ్‌ ఎక్కువ ఉంది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను వేయగా.. ప్రైవేటు ఆపరేటర్లు ఉన్న బస్సులన్నింటినీ ఈ నాలుగు నగరాలకు ఎక్కువ నడుపుతూ దండుకుంటున్నారు. బుధవారం నుంచే పండగ రద్దీ మొదలైపోయింది. విజయవాడ, గుంటూరుల్లోని ప్రైవేటు హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు చాలావరకూ 10వ తేదీ నుంచి సెలవులు ప్రకటించడంతో బుధవారం ఇరు నగరాల్లో బస్టేషన్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా రాయలసీమ జిల్లాలైన కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు ప్రాంతాలకు బుధవారం భారీ సంఖ్యలో విద్యార్థులు తరలివెళ్లారు. ఇదే అదనుగా.. ప్రైవేటు బస్సుల టిక్కెట్‌ ధరలను విపరీతంగా పెంచేశారు. ఈనెల 13వ తేదీ వరకూ ఇదే రద్దీ కొనసాగనుంది. ఇప్పటికే.. సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 12 మధ్యలో సర్వీసుల టిక్కెట్లన్నీ అయిపోయాయి. 13వ తేదీన హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వచ్చేందుకు ఆర్టీసీ బస్సుల టిక్కెట్లన్నీ అయిపోయాయి. ఉన్న ప్రైవేటు బస్సుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు ఎంత వెచ్చించైనా కొనుగోలు చేస్తున్నారు. తిరిగి వచ్చేందుకు సైతం.. 14, 15, 16వ తేదీల్లో భారీ డిమాండ్‌ ఉంది.

హైదరాబాద్‌, విశాఖ, బెంగళూరు, చెన్నై నగరాల వైపు వెళ్లే రైళ్లన్నీ నాలుగు నెలల కిందటే నిండిపోయాయి. సంక్రాంతి సందర్భంగా రైళ్ల రిజర్వేషన్‌ ప్రారంభమవ్వగానే.. వారం రోజుల్లోనే జనవరి 10 నుంచి బెర్తులన్నీ నిండిపోయాయి. అటునుంచి వచ్చేందుకు సైతం జనవరి 14 నుంచే బెర్తులు నిండిపోయాయి. ప్రత్యేక రైళ్లను వేస్తున్నా.. సంక్రాంతి రద్దీకి అవి ఏమాత్రం సరిపోవు. దీంతో బస్సులే ప్రయాణికులకు ఉన్న ఏకైక మార్గం. ఇదే అదనుగా ఏటా మాదిరిగానే ఈసారీ టిక్కెట్ల ధరలు అమాంతం పెంచేశారు. 10వ తేదీ నుంచి 13 వరకూ ఇటునుంచి వెళ్లే బస్సులన్నీ 80శాతం నిండిపోయాయి. అదికూడా.. సాయంత్రం 6 నుంచి రాత్రి సమయంలో బయలుదేరి వెళ్లే బస్సులు చాలావరకూ నిండిపోయాయి. ఊళ్లకు వెళ్లేవాళ్లంతా ఉదయం పనులు, విధులు ముగించుకు రాత్రికి బయలుదేరి వెళ్లి ఉదయానికి చేరుకుంటూ ఉంటారు. అందుకే.. సాయంత్రం నుంచి ఉన్న బస్సులన్నీ నిండిపోయాయి. ఉదయం వేళ మాత్రమే కొన్ని బస్సుల్లో ప్రస్తుతం ఖాళీలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నా.. ప్రైవేటుకూ భారీగా డిమాండ్‌ ఉంటోంది. ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ పదో తేదీ నుంచి ప్రత్యేక సర్వీసులను ప్రారంభించింది. రాయలసీమ, హైదరాబాద్‌, విశాఖ, చెన్నై, బెంగళూరు నగరాలకు ఇటునుంచి వెళ్లేందుకు 13 వరకూ 256 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. చెన్నై, బెంగుళూరుకు 20, రాయలసీమకు 94, విశాఖ సహా కోస్తా ప్రాంతానికి 202 బస్సులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు అవసరాన్ని బట్టి ఏర్పాటు చేస్తున్నారు.

విచ్చలవిడిగా పెంచేశారు. 
ప్రస్తుతం సాధారణ రోజుల్లో విజయవాడ, హైదరాబాద్‌ మధ్య ఏసీ సర్వీసులకు టిక్కెట్‌ ధర రూ.600 వరకూ ఉంటుంది. ప్రస్తుతం ధర రూ.వెయ్యి పైనే ఉంది. నాన్‌ ఏసీ టిక్కెట్‌ ధర రూ.350 ఉండగా.. ప్రస్తుతం రూ.850 వరకూ ఉంటోంది. గుంటూరు నుంచి హైదరాబాద్‌కు సాధారణ రోజుల్లో ఏసీ రూ.600, నాన్‌ ఏసీ రూ.400 ఉండగా.. ప్రస్తుతం ఏసీ రూ.1300, నాన్‌ఏసీ రూ.1100 వరకూ ధర పలుకుతోంది. విజయవాడ నుంచి బెంగళూరుకు సాధారణ రోజుల్లో ఏసీ రూ.1200 ఉండగా, నాన్‌ఏసీ రూ.800 ఉండేది. ప్రస్తుతం ఏసీ రూ.2500-3వేలు, నాన్‌ఏసీ రూ.1500 పైనే ధర ఉంది. గుంటూరు నుంచి బెంగళూరుకు కూడా ధరలు భారీగా పెంచేశారు. సాధారణ రోజుల్లో ఏసీ రూ.900, నాన్‌ఏసీ రూ.800 ఉండగా.. ప్రస్తుతం రూ.2500, నాన్‌ఏసీ రూ.1500 వరకూ వసూలు చేస్తున్నారు.

. రైళ్లు సైతం..

 సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా గురువారం నుంచి ఈనెల 17వ తేదీ వరకు ప్లాట్‌ఫాం టికెట్‌ ధరలను రూ.10 నుంచి రూ.20కి పెంచుతూ నిర్ణయించారు. ఈమేరకు బుధవారం విజయవాడ రైల్వే అధికారులు ఒక ప్రకటన వెలువరించారు. విజయవాడ డివిజన్‌ పరధిలోని విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు రైల్వే స్టేషన్లలో ఈ పెంపుదల అమల్లోకి వస్తుందన్నారు.

Related Posts