ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీ, కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు రంగం సిద్దం అవుతోందా?. పరిణామాలు ఆ దిశగానే చకచకా ముందుకు సాగుతున్నాయి. ఆదివారం నాడు ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానించారు. ఇంత కంటే ఏం కావాలి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటానికి. సీడబ్ల్యూసీలో ఏపీకి ప్రత్యేక హోదాపై తీర్మానం చేయటంతోపాటు ఇతర రాష్ట్రాల వాళ్ళు దీన్ని వ్యతిరేకించవద్దని రాహుల్ ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ ఇదే రాహుల్ గాంధీ గత శుక్రవారం నాడు లోక్ సభలో జరిగిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో మాత్రం ఈ విషయాన్ని ప్రస్తావించలేదు.. ఏపీ బాధిత రాష్ట్రం…దేశంలో ఇలాంటి మోడీ బాధితులు ఎంతో మంది ఉన్నారని రాజకీయ విమర్శలు చేశారే తప్ప..తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని లోక్ సభ సాక్షిగా రాహుల్ గాంధీ ప్రకటించలేకపోయారు. కానీ సీడబ్ల్యూసీలో మాత్రం తీర్మానం చేసి..‘రాజకీయ ప్రయోజనం’ పొందేందుకు ఎత్తుగడ వేసినట్లు స్పష్టంగా కన్పిస్తోంది.