- విమర్శలకు భయపడాల్సిన పని లేద
-
కేంద్రంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు భయపడాల్సిన పని లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు ఇప్పటికీ కేంద్రం పరిశీలనలో ఉందన్నారు. నిపుణుల అభిప్రాయం దీనికి వ్యతిరేకంగా ఉన్నా కేంద్రం మాత్రం సానుకూలంగా పరిశీలిస్తోందని పార్టీ రాష్ట్ర నేతలకు తెలిపారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు, శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు, పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ తదితరులతో అమిత్‌షా ఢిల్లీలో గురువారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అసెంబ్లీ సీట్ల పెంపు విషయం ఏం చేద్దామని అమిత్ షా ప్రశ్నించగా.. మీరే తుది నిర్ణ‘యం తీసుకోవాలి’ అని నేతలు బదులిచ్చారు. కొద్ది రోజులుగా టీడీపీ అనుసరిస్తున్న వైఖరిని, బడ్జెట్ తర్వాత ఆ పార్టీ చేస్తున్న విమర్శల్ని బీజేపీ నేతలు పార్టీ చీఫ్‌కు వివరించారు. ‘అదేమిటీ.. మనం రాష్ట్రానికి అడిగినవన్నీ ఇస్తున్నాము కదా!’ అని షా అన్నారు. ‘ఇలాంటి వ్యాఖ్యలకు మీరేమీ భయపడనక్కర్లేదు!’ అని ఆయన చెప్పినట్లు పురందేశ్వరి వివరించారు.
‘‘బూత్‌స్థాయి నుంచీ పార్టీని బలోపేతం చేయండి. కేంద్రంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు జవాబివ్వండి. రాష్ట్రానికి మోదీ సర్కారు చేస్తున్న సహాయం గురించి ప్రజలకు వివరించండి’’ అని అమిత్‌షా సూచించినట్లు తెలిసింది. ఇక... రాజధాని నిర్మాణానికి వివరణాత్మక నివేదిక (డీపీఆర్) ఇవ్వనప్పటికీ ఏదో ఒక ఖాతాలో నిధులు ఇస్తున్నామని, ఏపీ నుంచి నివేదికలు రాకపోతే తామేమి చేయగలమని అమిత్‌షా అన్నట్లు రాష్ట్ర నాయకులు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు మాట్లాడుతూ... సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంపైనే అధికంగా చర్చలు జరిగాయని తెలిపారు. పార్లమెంటరీ నియోజకవర్గాలను మూడు క్లస్టర్లుగా విభజించి వాటికి ఇన్‌చార్జిలను నియమించినట్లు తెలిపారు. ఉత్తరాంధ్రలో నియోజకవర్గాలకు మురళీధర్‌రావును, మధ్యాంధ్రలో ఉన్న నియోజకవర్గాలకు విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ను, రాయలసీమలో నాలుగు నియోజకవర్గాలకు మహారాష్ట్ర మంత్రి వినోద్ తావ్డేను ఇప్పటికే బాధ్యులుగా నియమించగా, వారు ఆయా ప్రాంతాల్లో పర్యటించి బూత్‌స్థాయిలో పరిస్థితులను పార్టీ సారథికి తెలిపారన్నారు.
గతంలో రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెంలో తాను పర్యటించానని ఈసారి రాయలసీమలో పర్యటిస్తానని అమిత్‌షా చెప్పినట్లు తెలిపారు. బూత్‌స్థాయిలో ఎక్కువమంది కార్యకర్తలను తయారు చేసి పార్టీ ని విస్తరించాలని సూచించారన్నారు. బీజేపీ, టీడీపీ ఇప్పటికీ మిత్రపక్షాలుగా కలిసి పనిచేస్తున్నాయని, తాము కలిసే ఉన్నామని, తమ మధ్య ఎటువంటి ఇబ్బందులు లేవని హరిబాబు అన్నారు. ఏదైనా ఉన్నా పార్టీ పెద్దలు చర్చించి పరిష్కరించుకుంటారన్నారు. చిటపటలు ఒక్క నిమిషంలో పోతాయని ఆయన పేర్కొన్నారు