YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లంకలు దాటేదెట్టా

లంకలు దాటేదెట్టా
జిల్లాలో 155 లంక గ్రామాలు ఉన్నాయి. వీటిలో 100కు పైగా గ్రామాలకు నేటికీ వంతెన, రోడ్డు సౌకర్యం లేదు. ఈ లంకలకు చెందిన ప్రజలు నిత్యం గోదావరి నదిపై ప్రమాదకరంగా పడవలు, నావలు, బోట్లపై ప్రయాణిస్తున్నారు. నిత్యం ప్రవహించే గోదావరిలో పరిమితికి మించిన బరువుతో నాటు పడవల్లో ప్రయాణిస్తే పడవ ఉపరితలానికీ, నీటి మట్టానికి మధ్య వత్యాసం తక్కువగా ఉంటుంది. సంగమ ప్రాంతాల్లో అయితే ఈ వ్యత్యాసం కేవలం నాలుగు అంగుళాలు మాత్రమే ఉంటుంది. ప్రవాహ ఉద్ధృతి అధికంగా ఉన్నా, ఈదురు గాలులు బలంగా ఉంటే ఆ వ్యత్యాసం మరింత తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో నదిలోని నీరు పడవల్లోకి చేరుతుంది. ఆ సందర్భంలో ఏ మాత్రం అదుపుతప్పినా, నావికుడు పడవపై నియంత్రణ కోల్పోయినా పెను ప్రమాదం తప్పదు. సామర్థ్యానికి మించిన ప్రయాణికులు, వాహనాలు, ఇతర సామగ్రితో పడవలపై ప్రయాణం నిత్య కృత్యమైంది.
పలు సందర్భాల్లో ఇదే ప్రాణసంకటంలా పరిణమిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా పడవలు తిరుగుతున్నా పర్యవేక్షించాల్సిన యంత్రాంగం కనీస చర్యలు చేపట్టడం లేదు. గత ప్రమాదాల అనుభవాల నుంచి పాఠం నేర్వడం లేదు. నష్టం జరిగాక కొన్ని రోజుల పాటు హడావుడి చేయడం మినహా తరువాత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదు. రెండు దశాబ్దాల్లో జిల్లాలో సుమారు 12 ఘోర పడవ ప్రమాదాలు చోటుచేసుకోగా, అంతకు మించి త్రుటిలో తప్పిన ప్రమాదాలున్నాయి. తాజాగా శనివారం ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద చోటుచేసుకున్న ప్రమాదాన్ని పరిశీలిస్తే.. ప్రమాదవశాత్తూ విపత్కర పరిస్థితి ఎదురైతే తమను తాము కాపాడుకునేందుకు ఎలాంటి రక్షణ సామగ్రి అందుబాటులో లేదు. వరద ఉద్ధృతి సమయంలోనూ పరిమితికి మించి ప్రయాణికులు, వాహనాలు, ఇతర సామగ్రిని తరలించడం తీవ్ర నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది.
విపత్తుల నిర్వహణకు సంబంధించి ఏటా వరదల సమయంలో, తుపాన్లకు ముందు జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు కమిటీలు నియమిస్తున్నారు. వీటికి కలెక్టర్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. రెవెన్యూ, మత్స్య శాఖ, జలవనరులు, పోలీసు, తదితర శాఖలతో పాటు కొందరు ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తున్నారు. రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ఆర్డీవో అధ్యక్షతన ఇదే క్రమంలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. మండల స్థాయిలో తహసీల్దార్‌తోపాటు మండల స్థాయి అధికారులను కమిటీలో భాగస్వాములుగా చేస్తూ, వరద, తుపాను, తదితర విపత్తుల ప్రభావిత గ్రామాల సర్పంచులు, ఉత్సాహవంతులైన గ్రామాల్లోని యువతను నియమిస్తున్నారు. గ్రామాల్లో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, సర్పంచి తదితరులు కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఇవి కేవలం నిర్ణీత సమయాల్లో సమావేశాల నిర్వహణకే పరిమితమవుతున్నాయి. క్షేత్ర స్థాయిలో జరిగే నష్టాలపై, లంక గ్రామాల్లోని పరిస్థితులకు అనుగుణంగా జరిగే నష్టాన్ని ముందుగా అంచనా వేయడంలో విఫలమవుతున్నాయి. వరదల సమయంలో రేవుల్లో పడవల ద్వారా తప్ప మరో మార్గం లేని ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రమాణాలు పాటించని రేవు దాటింపులను నిలువరించే చర్యలు మచ్చుకైనా కనిపించడంలేదు.
రేవుల్లో పడవ దాటింపులకు సంబంధించి నిర్వాహకులు కచ్చితమైన ప్రమాణాలను పాటించాలన్న నిబంధనలున్నా అమలు కావడం లేదు. జిల్లా ఉన్నతాధికారులు ఇటీవల పడవ రేవులున్న అన్ని మండలాల పోలీసు స్టేషన్లకు బోట్లు, పడవల అనుమతులకు సంబంధించి పాటించాల్సిన నిబంధనలపై స్పష్టత ఇచ్చారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తే ఎక్కడా అనమతులు లేవని స్పష్టమైంది. ఏటా అధికారులు పడవ దాటింపులకు వేలంపాట నిర్వహించి, వారికే నిర్వాహణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పోర్టుశాఖ జారీ చేసిన నిబంధనల అనుమతి పత్రాల్లో పడవ పొడవు, వైశాల్యం, లోతు, ఇంజిన్‌ సామర్ధ్యం, బోటు, పడవలకు మత్స్యశాఖ, మెరైన్‌ శాఖ ద్వారా జారీ అయిన నంబరు అన్నింటితోనూ దరఖాస్తు చేయాల్సి ఉంది. వీటితోపాటు లైఫ్‌జాకెట్లు, లైఫ్‌బాయ్‌లు, అగ్నిప్రమాద నిరోధక సామగ్రి, తాళ్లు అందుబాటులో ఉంచాలి. స్థానిక పోలీస్‌, మెరైన్‌, రెవెన్యూ, మత్స్యశాఖ పర్యవేక్షించాల్సి ఉన్నప్పటికీ అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు.

Related Posts