వైసీపీ చేసే బంద్ వల్ల ప్రయోజనం ఏమిటి అని, వైకాపా బంద్ పేరుతో రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం విభజన హామీలు నెరవేర్చకుండా ఇబ్బంది పెడుతుంటే.. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బంద్‌ల పేరుతో మరింత నష్టం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. కేంద్రం చేసిన తప్పులకు రాష్ట్రాన్ని శిక్షించడం ఏంటని వైకాపా నేతలను నిలదీశారు. రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తే పెట్టుబడులు రావని... యువతకు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోతారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ఆలోచనలు రాష్ట్రానికి వచ్చే రాబడిని దెబ్బతీసేలా ఉన్నాయని, రాష్ట్రంలో అశాంతి సృష్టించవద్దని హెచ్చరించారు.