YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణను సస్యశ్యామలం

 తెలంగాణను సస్యశ్యామలం

రాష్ట్ర విభజన జరిగి మూడేళ్ళైనా ఆంధ్రా పాలకులు తెలంగాణాపై తమ అక్కసును ఇంకా వెళ్లగక్కుతూనే ఉన్నారు. నాడు అన్యాయం చేసిందే కాకుండా నేడు అర్థంలేని ఆరోపణలతో తెలంగాణ భూముల్లో పంటలు పండవని ఆంధ్రా శాస్త్రవేత్తలు అశాస్త్రీయ వాదనలు వినిపిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి కేటాయింపుల్లో వివక్ష వల్ల తెలంగాణ భూములను బీడుభూములుగా మార్చిందే కాక, ఇప్పుడిలా ఇక్కడ వరి సాగుచేస్తే నీరు వృథా అని అనడం సిగ్గుచేటు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతులు అప్పులు చేసి మొక్కవోని ధైర్యంతో సొంత పెట్టుబడులతో బోర్ల ద్వారా వరి సాగు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువులలో జలకళ సంతరించుకొంది. భూగర్భ జలాలు పెరిగా యి. సాగునీరు అందుబాటులోకి రావడంతో వరి ఉత్పాదకత కూడా భారీగా పెరిగింది. ఏపీనీ కాదంటే దేశ ఆహార భద్రతకు ముప్పు అని, తెలంగాణలో కిలో వరి ఉత్పత్తికి అయ్యే ఖర్చులు ఎక్కువని, సాగునీటి వాడుక సామర్ధ్యం తక్కువని, అసలు వాతావరణమే అనుకూలంగా లేదని అర్థంలేని వాదనలు వినిపిస్తున్నాయి.

రెండు రాష్ట్రాల్లో దాదాపు ఒకే వ్యవసాయ వాతావరణం ఉన్నది. రెండు రాష్ట్రాల్లో 20కి పైగా వరిరకాలు సాగులో ఉన్నాయి. సాగర్ ఆయకట్టులో పంటకాలం 120 రోజులైతే, గుంటూరు, కృష్ణా జిల్లా ల్లో 150 రోజులు, ప్రకాశం జిల్లాలో 140 రోజులు పడుతుంది. స్వల్పకాలిక వరి రకాలు తక్కువ దిగుబడినిస్తాయి. దీర్ఘకాలిక వరి రకాలు అధిక దిగుబడినిస్తాయి. ఆంధ్రలో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యేది దీర్ఘకాలిక రకాలే. ఆంధ్రలో డెల్టా భూముల్లో 14 రోజులపాటు నీరు నిలిచిపోతుందని, అక్కడ వరిసాగు అనుకూలమని, తెలంగాణలో ఎర్ర నేలలు కాబట్టి ఆరుతడి పంటలే వేసుకోవాలని వారి వాదన. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో వరిసాగు తలకు మించిన భారం. ఆ భారాన్ని భరించలేక రైతులు క్రాప్ హాలిడే కూడా ప్రకటించారు. వీటిని దృష్టిలో పెట్టుకోకుండా తెలంగాణపై  ఆరోపణలు చేయడం దేనికి? సాగుకు విపరీతంగా నీటిని వాడుతూ తక్కువ ఉత్పాదకత తీస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో ముందు వరిసాగును నిషేధించాలి. తరతరాలుగా వరిని ఏకపంటగా సాగుచేయడం వల్ల ఆ రాష్ట్రంలో భూములు వ్యాధుల క్షేత్రాలుగా మారాయి. విపరీతంగా ఎరువుల వాడకం వల్ల అక్కడి భూములు ఆమ్లత్వం సంతరించుకున్నాయి. కావున ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వరిసాగు నుంచి వేరే పంటలకు మారాలి.

ఆంధ్ర ప్రాంతంలో వరి సాగుకు సాగునీటి కాలువలు అందుబాటులో ఉన్నాయి. మొదటి నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో అవసరం ఉన్నా లేకున్నా అధికంగా నీటిని విడుదల చేయుడంతో వృథాగా పోయే నీరే ఎక్కువ. దీనిని బట్టి కిలో వరి ధాన్యం ఉత్పత్తికి వాడబడుతున్న నీటి పరిమాణం చాలా ఎక్కువనే చెప్పాలి. అయితే ఎకరాలో సాగునీటి ఆధారంగా పండించటంలో అవసరమయ్యే నీటితో రెండు ఎకరా ల్లో ఆరుతడి వరి వేయువచ్చు. ఆరుతడి పంటకు అవసరమయ్యే నీరు తక్కువ, నీటి వినియోగ సామర్ధ్యం ఎక్కువ. అన్ని పంటల్లో బిందు, తుంపర సేద్యాల వాడకంతో అత్యధికంగా 80 - 90 శాతం నీటి వాడుక సావుర్ధ్యం తెలంగాణ రాష్ట్రం సాధిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో కొంతమంది రైతులు వరిలోనూ తుంపర బిందు సేద్యాన్ని అవలంభిస్తున్నారు. నీటిని పొదుపుగా వాడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వరికి ప్రత్యేక పరిశోధనా స్థానాన్ని ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీల ప్రధాన కేంద్రంగా ఉన్న అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ తెలంగాణలో ప్రాంతీయ కేంద్ర ఏర్పాటుకు స్థలం ఇవ్వమని కోరితే, నిరాకరించి అన్యాయం చేశారు.  అత్యంత వైవిధ్యైమెన వరి రకాలు తెలంగాణలో ఉన్నాయి. 

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అంతగా అనుకూలం కాని సన్నరకం బియ్యాన్నిచ్చే బీపీటీ 5204ను బలవంతంగా ఇక్కడి రైతులపై రుద్దారు. ఈ రకానికి సోకని రోగమంటూ లేదు. సగానికిైపెగా పెట్టుబడి ఖర్చులు వాటి నివారణకే వాడాల్సి వస్తుం ది.  ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన తెలంగాణ సోన రైతులకు సిరులు కురిపిస్తున్నది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ రకాన్ని భారీగా సాగుచేస్తున్నారు.  ఈ రకం వరి సాగుకు ఆంధ్ర రైతులు కూడా క్యూ కడుతున్నారు. యాసంగిలో ఎక్కువ చలిలో తాలు గింజలు ఏర్పడి ధాన్యం నష్టం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లోనూ దిగుబడిని ఇవ్వగలిగిన రకాలు జగిత్యాల, వరంగల్‌లోని పరిశోధనా సంస్థల్లో సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణ అంతా విత్తనోత్పత్తికి అత్యంత అనుకూలం. వరిలో సూటి రకాలు, హైబ్రిడ్ రకాల విత్తనోత్పత్తి భారీగా తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో జరుగుతోంది.

దేశంలో ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో వరిసాగుకు అత్యంత అనుకూల వాతావరణం ఉన్నది కాబట్టే భారతీయ వరి పరిశోధన సంస్థను తెలంగాణలో ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా అభివృద్ధి పరచిన వరిలో సూటిరకాలు, హైబ్రిడ్ రకాలను విడుదలకు ముందు ఇక్కడే పరీక్షిస్తారు. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం. రైతుల బాగుకోసం భారీ సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చేస్తోంది. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు, తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా, రాష్ట్రంలో ప్రతి ఎకరా సాగుభూమికి సాగునీరు, అన్ని గ్రామాలకు తాగునీరు అందించాలన్న సీఎం కల త్వరలోనే సాకారం కానుంది. ప్రజల ఆశలు నెరవేరనున్నాయి.

Related Posts