స్విస్ నేషనల్ బ్యాంకు వార్షిక బ్యాంకు గణాంకాల ప్రకారం ఆయా బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము తగ్గినట్లు తెలుస్తోంది. 2013 నుంచి 2017 వరకూ చూస్తే ఇండియన్ డిపాజిట్ల తగ్గుదల 80.2 శాతంగా కనిపిస్తోంది. 2016 నుంచి 2017 సంవత్సరానికి స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు పెరిగిందని కొన్ని మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ సమాచారంలో కొన్ని తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ విధంగా పెరిగిన డిపాజిట్ గణాంకాల్లో వీటి వివరాలు సైతం ఉన్నాయి. అందులో డిపాజిటేతర ఆస్తులు, భారతదేశంలో స్విస్ బ్యాంకు బ్రాంచుల వ్యాపారం, అంతర్ బ్యాంకుల లావాదేవీలు, అంతర్గతంగా డిపాజిట్‌దారుడు-ట్రస్ట్‌ల మధ్య జరిగే లావాదేవీలు వంటి వాటిని కలిపి లెక్కించిన కారణంగా డిపాజిట్ల సొమ్ము పెరిగినట్లు కనిపిస్తోంది. స్విస్ రాయబారి ఆండ్రియాస్ బౌమ్ దేశ ఆర్థిక మంత్రి పీయూష్ గోయెల్‌కు రాసిన లేఖ సారాంశం ఏంటంటే.. భారతీయులు చేసిన ప్రతీ డిపాజిట్‌ను అప్రకటిత ఆదాయంగా పరిగణిస్తూ నల్లధనంగా చిత్రీకరిస్తున్నారు. నిజానికి బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్(బీఐఎస్) .. స్థానిక బ్యాంకింగ్ గణాంకాల(ఎల్‌బీఎస్)ను స్విట్జర్లాండ్ నేషనల్ బ్యాంకుతో సంప్రదించి అధికారిక లెక్కలను తయారుచేస్తుంది. ఎల్‌బీఎస్ గణాంకాల్లో బ్యాంకు ఎక్కడ ఉందో దాని ఆధారంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇంకా ఇందులో ఒక దేశం నుంచి మరో దేశం మధ్య జరిగే బ్యాంకింగ్ లావాదేవీలను 95 సైతం వరకూ కవర్ చేస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ తయారుచేసే సమాచారంలో బ్యాంకు రుణాలు, డిపాజిట్లే కాకుండా ఇతర వివరాలు సైతం ఉంటాయి(వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలు చేసే బ్లాక్ మనీ తరలింపు వంటివి కూడా, అంతర్ బ్యాంకు లావాదేవీలు ఉండవు).
దీని ప్రకారం చూస్తే 2016 నుంచి 2017 మధ్య డిపాజిట్లు 34.5% తగ్గాయి. 2016లో 800 మిలియన్ డాలర్లుగా ఉన్న భారతీయుల డిపాజిట్లు 2017 సంవత్సరానికి 524 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. 2013లో స్విస్ బ్యాంకుల్లో మనోళ్ల డిపాజిట్లు 2648 మిలియన్ డాలర్లుగా ఉండగా అదే 2017నాటికి 524 మిలియన్ డాలర్లకు పడిపోయినట్లు బీఐఎస్ క్రోడీకరించిన సమాచారం వెల్లడించింది. అంటే భారతీయుల డిపాజిట్లు ఈ నాలుగేళ్లలో 80.2% తగ్గినట్లు లెక్క. కొన్ని అధికారిక వర్గాలు వెల్లడించిన మేరకు డిసెంబరు 21,2017 నాడు భారత్.. స్విట్జర్లాండ్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం జనవరి 1,2018 తర్వాత నుంచి అంతర్జాతీయ ప్రమాణాల మేరకు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు. సెప్టెంబరు 2019 నుంచి ఏటేటా డిపాజిట్ గణాంకాలకు సంబంధించి డేటా బదలాయింపు జరుగుతుంది.